Tuesday, September 8, 2026

మహిళా పోలీసులను పరామర్శించిన మంత్రి సీతక్క..

Must read

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసు అధికారులు జరిగిన పరిణామాలను మంత్రికి వివరించారు. విధి నిర్వహణలో ఎదురైన ఇబ్బందులు, ఘర్షణ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను సీతక్కకు వివరించినట్లు సమాచారం.మహిళా పోలీసుల వాదన ప్రకారం.. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అసభ్యంగా తాకారని, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో విజువల్స్‌ను కూడా మంత్రికి చూపించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.విధుల్లో భాగంగా తాము తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో కొందరు బీఆర్ఎస్ నేతలు టీషర్ట్‌లు విసిరి తమ మీదికి వచ్చారని మహిళా పోలీసులు వివరించినట్లు సమాచారం. ఆ సమయంలో విధి నిర్వహణలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని మంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతు చూస్తామని కొందరు బెదిరించినట్లు కూడా మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు, ఫొటోలు బయటకు రావడంతో కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందికి గురవుతున్నారని మహిళా పోలీసులు మంత్రికి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.మహిళా పోలీసుల ఫిర్యాదులను విన్న మంత్రి సీతక్క వారికి ధైర్యం చెప్పారు. “ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ధైర్యంగా విధులు నిర్వహించాలని, తమ బాధ్యతలను తాము నిర్వర్తించాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఘటనకు సంబంధించి మహిళా పోలీసుల వివరణలో మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యేల పట్ల తాము దురుసుగా వ్యవహరించలేదని మహిళా పోలీసులు స్పష్టం చేసినట్లు సమాచారం. వారిని అసెంబ్లీ లోపలికి అనుమతించేందుకు తాము ప్రయత్నిస్తున్న సమయంలో ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారిని వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, ఈ క్రమంలోనే తోపులాట చోటుచేసుకుందని మహిళా పోలీసులు వివరించినట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పటికే తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తుతుండగా.. విధుల్లో ఉన్న మహిళా పోలీసులపై బీఆర్ఎస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారని అధికార పక్షం ఆరోపిస్తోంది.

తాజాగా మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించడం, వారు తమ వద్దకు తీసుకొచ్చిన ఫొటోలు, వీడియోల గురించి వివరించడం నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వీడియోలు, పోలీసుల నివేదికలు, ఫిర్యాదుల ఆధారంగా తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!