మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ విషయంలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని, 16,400 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. మెగా డీఎస్సీ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు.మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. 2019కు ముందు టీచర్ ఖాళీలపై పెద్ద ఎత్తున మాట్లాడిన జగన్.. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా 16,400 మందికి ఉద్యోగాలు కల్పించామని సోమిరెడ్డి తెలిపారు. ఇందులో సుమారు 300 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద ఉన్నాయని చెప్పారు. వేలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించిన అంశాన్ని పక్కనపెట్టి కేవలం స్పోర్ట్స్ కోటా అంశాన్ని పట్టుకుని వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.స్పోర్ట్స్ కోటాపై వచ్చిన ఆరోపణలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎస్ఏపీ వైస్ చైర్మన్ సహా ఉన్నతాధికారులు రెండుసార్లు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారని సోమిరెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ వైసీపీ రాజకీయ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. వచ్చే డిసెంబరులో మరో డీఎస్సీ, వచ్చే ఏడాది మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.జగన్ నేతృత్వంలోని వైసీపీపై సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. “స్కామ్స్‌లో పోటీ పెడితే జగన్ టీమే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది” అంటూ వ్యాఖ్యానించారు. జగన్ కుటుంబానికి సంబంధించిన గత కేసులను ప్రస్తావిస్తూ, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భారీ కుంభకోణం కేసులో కుమారుడు మొదటి ముద్దాయిగా ఉన్న చరిత్ర తమదేనని విమర్శించారు.
అలాగే వైసీపీ హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై కూడా సోమిరెడ్డి ప్రశ్నలు సంధించారు. ప్రైవేట్ రిసార్టుల్లో పేపర్ల మూల్యాంకనం, ఓఎంఆర్ షీట్లలో వైట్నర్ వినియోగం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. తమ హయాంలో జరిగిన అక్రమాలపై సమాధానం చెప్పకుండా, ఇప్పుడు మెగా డీఎస్సీపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.స్పోర్ట్స్ కోటా అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించిన సోమిరెడ్డి.. ఈ కేసులో న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు, ముఖ్యంగా కుటుంబ బాధ్యతలతో పాటు సంవత్సరాల పాటు కష్టపడి మెరిట్‌లో ఉద్యోగాలు పొందిన మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని సోమిరెడ్డి తెలిపారు. అమరావతిలో డేటా సెంటర్లు, క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులు వస్తున్నాయని, గతంలో నిలిచిపోయిన పలు సాగునీటి ప్రాజెక్టులు తిరిగి వేగం పుంజుకున్నాయని చెప్పారు. పట్టిసీమ ద్వారా రైతులకు జరుగుతున్న ప్రయోజనాలను కూడా ప్రస్తావించారు.తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో సొంత పార్టీ నాయకులు, మంత్రులను కూడా కలవని జగన్ వంటి పాలకుడిని చూడలేదని సోమిరెడ్డి విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా ప్రభుత్వం దెబ్బతినాలనే ప్రతికూల ధోరణితో వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, “చేతల ప్రభుత్వం” అని సోమిరెడ్డి పేర్కొన్నారు. డీఎస్సీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.




