భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ భారీ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు చేస్తోంది. సుమారు 4 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.37,000 కోట్లకు పైగా విలువైన ఈ ఐపీఓను 2026 పండుగ సీజన్‌లో తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఇష్యూ విలువ సుమారు రూ.37,700 కోట్లుగా ఉండొచ్చని తెలుస్తోంది.
జియో ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను సెబీకి సమర్పించింది. ఆ ప్రతిపాదనలో 27 కోట్ల వరకు కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయాలని కంపెనీ పేర్కొంది. ఇవి ఐపీఓ అనంతరం కంపెనీ ఈక్విటీ క్యాపిటల్‌లో సుమారు 2.9 శాతం వాటాను సూచిస్తాయి. ఈ ఇష్యూలో ఆఫర్ ఫర్ సేల్ ఉండదని డ్రాఫ్ట్ వివరాలు సూచిస్తున్నాయి.
నవరాత్రి.. లేదంటే దీపావళి
జియో ఐపీఓను అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ తొలి వారంలో తీసుకురావచ్చనే చర్చ మార్కెట్ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా నవరాత్రి నుంచి దీపావళి మధ్య పండుగ సీజన్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే తుది ఇష్యూ తేదీ, ధరల వివరాలు, ఇతర షరతులను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు జియో ప్లాట్‌ఫామ్స్ దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనను రాబట్టేందుకు కంపెనీ ప్రయత్నించనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
హ్యుందాయ్ రికార్డు బద్దలు?
జియో ఐపీఓ విజయవంతమైతే ప్రస్తుతం భారత్‌లో అతిపెద్ద ఐపీఓగా ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇండియా రికార్డును అధిగమించే అవకాశం ఉంది. హ్యుందాయ్ 2024లో సుమారు రూ.27,870 కోట్ల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసింది. జియో ప్రతిపాదిత ఇష్యూ సుమారు రూ.37,700 కోట్ల స్థాయిలో ఉంటే, ఆ రికార్డు గణనీయంగా బద్దలయ్యే అవకాశం ఉంది.
ఇదే సమయంలో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రతిపాదిత ఐపీఓ కంటే కూడా జియో ఇష్యూ పెద్దదిగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. దీంతో భారత ప్రైమరీ మార్కెట్‌లో జియో ఐపీఓ అత్యంత కీలకమైన ఈవెంట్‌గా మారనుంది.
ఐపీఓ నిధులతో ఏం చేస్తారు?
జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదిత ఐపీఓ ద్వారా వచ్చే నిధుల్లో ప్రధాన భాగాన్ని దాని మెటీరియల్ సబ్సిడియరీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) రుణాలను ముందస్తుగా చెల్లించేందుకు ఉపయోగించనున్నట్లు DRHPలో పేర్కొంది. సుమారు రూ.27,500 కోట్ల వరకు రుణాన్ని రీపే లేదా ప్రీపే చేయడానికి నిధులను వినియోగించే అవకాశం ఉంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నారు.
జియోలో భారీ ఇన్వెస్టర్లు
జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మెటా, గూగుల్‌తో పాటు సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, KKR, సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి సంబంధించిన సంస్థలు జియోలో పెట్టుబడులు కలిగి ఉన్నాయి. తాజా వివరాల ప్రకారం మెటా వాటా సుమారు 9.9 శాతం, గూగుల్ వాటా సుమారు 7.7 శాతంగా ఉంది.




