Friday, September 4, 2026

బీఆర్ఎస్‌కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్.. పదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సవాల్!

Must read

ఇతర రాజకీయ పార్టీల నుంచి నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకుని బీఆర్ఎస్‌ నానాజాతి సమితిగా మారిందని, అలాంటి పార్టీ కాంగ్రెస్‌ను ‘పచ్చ కాంగ్రెస్’ అంటూ విమర్శించడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్‌లో టీడీపీ నుంచి వచ్చిన నాయకులు ఉన్నప్పుడు ఆ పార్టీని కూడా ‘పచ్చ పార్టీ’ అనాలా? అని ప్రశ్నించారు.

గురువారం ములుగు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇతర పార్టీల నాయకుల గురించి మాట్లాడే ముందు కేటీఆర్ తన పార్టీ చరిత్రను ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు లేరా అని ప్రశ్నించారు. తమ పార్టీలోకి వస్తే పవిత్రులు, మరో పార్టీలోకి వెళ్తే అనైతికులా? ఇదేనా మీ రాజకీయ సంస్కారం? అంటూ నిలదీశారు.

టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన నాయకులు ఎంతమంది ఉన్నారో ప్రజలకు తెలుసన్నారు. అసలు కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఏ పార్టీ నుంచి ప్రారంభమైందో గుర్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలవుతున్నప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వాటిని ఓర్వలేక నిరసనల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా? అని సీతక్క ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు లక్ష ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని సీతక్క విమర్శించారు. ప్రజా ప్రభుత్వం తొలి దశలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రతి అర్హుడైన పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వానికి లేదని సీతక్క విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులకు సన్నవడ్లకు బోనస్‌ ఇస్తూ, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, అదే సన్నబియ్యాన్ని పేద కుటుంబాలకు పంపిణీ చేస్తోందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందితే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.

సామాన్య కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ బిల్లు చెల్లించకపోతే పేదల ఇళ్లకు కరెంట్‌ సరఫరా నిలిపివేసిన రోజులను ప్రజలు మర్చిపోలేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత ఎరువులు, దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి, ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నేతలు గుర్తు చేసుకోవాలని అన్నారు.

రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, ఉద్యోగాల భర్తీ, మహిళా సంక్షేమ కార్యక్రమాలు సహా తాము చేపట్టిన ప్రతి పనికి లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సీతక్క స్పష్టం చేశారు. మండలాల వారీగా లబ్ధిదారుల జాబితాలతో బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేశారు.

అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎందుకు సహకరించడం లేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

ప్రతిపక్షంగా ఉండటం అంటే ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డుకోవడం కాదని సీతక్క అన్నారు. ప్రజలకు మేలు చేసే అంశాల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరించి మంచి సూచనలు చేయాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలు, అవమానకరమైన పోస్టర్లు, చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులను హెచ్చరించారు.

తమ నాయకులు, ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టర్లు వేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తమ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని, సహనం కోల్పోతే నష్టం ప్రత్యర్థులకే జరుగుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగానే గట్టిగా సమాధానం చెబుతామని సీతక్క పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముశినేపల్లి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!