కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇవాళ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఆవిర్భావ సభకు ర్యాలీగా వెళ్తున్న కవితను మీడియా ప్రశ్నించగా.. ఈ మేరకు సమాధానమిచ్చారు. అంతకుముందు ఇంట్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన కవిత.. తన భర్త, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గన్‌పార్కు వద్దకు చేరుకొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి మునీరాబాద్‌కు ర్యాలీగా బయల్దేరారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన కవిత.. తెలంగాణలో కొత్త విప్లవం మెుదలైందని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నట్లు తెలిపారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భాగస్వామ్యం అవసరమని కోరారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలకపాత్ర పోషించిందన్నారు కవిత.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన కవిత, తెలంగాణ జాగృతి పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. 2014లో నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున లోక్సభకు ఎన్నికైన ఆమె, 2018లో ఓటమి పాలయ్యారు. అనంతరం రెండు దఫాలు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దిల్లీ మద్యం కేసులో అరెస్ట్, బెయిల్ తదనంతర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, విధానాలతో కవిత విభేదిస్తూ వచ్చారు. నేతలు, పార్టీపై బహిరంగ విమర్శలు చేయడంతో 2025 సెప్టెంబర్ 2న ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. ఆ మరుసటి రోజే బీఆర్ఎస్ పార్టీకి, శాసన మండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు.
ఈనాటి కేసీఆర్ వేరు : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట శనివారం కొత్త పార్టీ ప్రకటించిన ఆమె.. ఆయన మారిపోయారని, రాజకీయ పరిణతి కోల్పోయారంటూ వ్యాఖ్యానించారు. ఆనాటి కేసీఆర్ వేరు..ఈనాటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేశారు. ఈనాటి కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి. ఆ సార్ ఇప్పుడు రారు.. ఎందుకంటే ఆయన మరమనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ అయ్యారు.



