భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాలు ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె వెంట స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క భూపాలపల్లి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1.85 కోట్లు విలువైన వడ్డీ లేని రుణాలను మంజూరు చేసి పంపిణీ చేశారు. అదేవిధంగా, రూ.49.03 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు.
మరియు రూ.38.90 లక్షల విలువ గల లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను కూడా సీతక్క మహిళలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ…
“ఇందిరాగాంధీ స్పూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఒంటరి మహిళ అయిన ఇందిరాగాంధీ పాకిస్తాన్‌ను మట్టికరిపించారు. అట్టడుగు వర్గాల ప్రజలకు భూములు పంచారు, బ్యాంకులను జాతీయీకరించారు. ఆవిడే మాకు ఆదర్శం.”
అలాగే SHG సభ్యులు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వ లక్ష్యం “కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తయారుచేయడం” అని మంత్రి పేర్కొన్నారు.
“మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అన్ని రంగాల్లో మేము ప్రోత్సహిస్తున్నాం. పారిశ్రామిక వెత్తలుగా తయారవ్వాలి. SHGలో చేరితే ఆర్థిక ప్రయోజనాలతో పాటు సామాజిక భద్రత కూడా లభిస్తుంది. మహిళలను బలోపేతం చేస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది” అని మంత్రి సీతక్క హితవు పలికారు.




