Friday, June 26, 2026

పల్లెల్లో జోరుగా వనమహోత్సవాలు… లక్ష్యంగా 7 కోట్ల మొక్కలు

Must read

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమం పల్లెల్లో ఉత్సాహంగా కొనసాగుతోంది. బతుకమ్మ ఉత్సవాల మాదిరిగా గ్రామాల్లో పచ్చదనం కోసం ప్రత్యేక చైతన్యం నెలకొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ‘స్వచ్ఛత–పచ్చదనం’ కార్యక్రమం ఈ సారి మరింత విస్తృతంగా సాగుతోంది.గత ఏడాది 6.9 కోట్ల మొక్కలు నాటి ఘనత సాధించిన పీఆర్డీ శాఖ, ఈసారి 7 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని సెట్ చేసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 1.7 కోట్ల మొక్కలు నాటగా, ఇది లక్ష్యంలో 39 శాతం అని అధికారులు వెల్లడించారు. మొక్కలు నాటే ప్రణాళికను వేగవంతం చేయాలని పీఆర్డీ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు.
ప్రతినిత్యం సమీక్షలు నిర్వహిస్తూ… మంత్రితో పాటు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, డైరెక్టర్ జీ. సృజన కూడా పర్యవేక్షణ చేపట్టారు. ఇప్పటివరకు మొక్కలు నాటేందుకు 85 శాతం గుంతలు తవ్వక పనులు పూర్తి అయినట్లు సమాచారం.అయితే నల్గొండ జిల్లాలో మాత్రం వనమహోత్సవం కొంచెం మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు అక్కడ కేవలం 42 వేల మొక్కలు మాత్రమే నాటగా, కార్యాచరణ వేగం పెంచాలని మంత్రి సీతక్క అక్కడి అధికారులను ఆదేశించారు.పచ్చదనం పై చైతన్యం కోసం మంత్రి సీతక్క స్వయంగా ములుగు, ఇల్లందు, కామారెడ్డి, పెద్దపల్లి, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి మొక్కలు నాటి సందేశం ఇచ్చారు. “పచ్చదనం లేని భవిష్యత్తు లేదు… పిల్లల భద్రత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించాలి” అని పిలుపునిచ్చారు.వనమహోత్సవం కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వచ్చంద సంస్థలు, బడిపిల్లలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. పచ్చదనం విస్తరణతో పాటు నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన పెరుగుతోంది. గ్రామాల్లో మౌలిక మార్పులకు వనమహోత్సవం దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వనమహోత్సవం జనమహోత్సవంలా మారుతోంది.ఇక ఈసారి వనమహోత్సవంలో భాగంగా పీఆర్డీ శాఖ పండ్ల తోటలకు, ఉద్యాన పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. మొత్తం 22 వేల ఎకరాల్లో పండ్ల తోటల లక్ష్యంతో నడిచిన కార్యక్రమంలో ఇప్పటివరకు 4521 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. ఇది లక్ష్యంలో 21 శాతం గా ఉంది.త్వరలోనే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునే దిశగా పీఆర్డీ శాఖ పటిష్టంగా అడుగులు వేస్తోంది. పల్లెల్లో పచ్చదనం పరచేందుకు ప్రభుత్వం, ప్రజలు కృషిచేస్తుండటంతో గ్రామీణ తెలంగాణ కొత్త తరం ఆవిర్భావానికి వేదికవుతోంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!