ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన మిత్రుడని, తమ్ముడిలాంటి వారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. తాను లోకేశ్‌ను రహస్యంగా కలిశానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
‘‘లోకేశ్ నేను కలిశానంటావు… అయినా కలిస్తే తప్పేంటి? ఆయన పక్క రాష్ట్ర మంత్రి. నేను దొంగలను కలిసే మనిషిని కాదు. లోకేశ్ ఏం నీలాగా సంచులు మోసే వాడా? నీలా చదువు రాని వాడా? నీలా ఢిల్లీలో లొఫర్ రాజకీయాలు చేసే వాడా?’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
‘‘లోకేశ్ మీ పెద్ద బాస్ చంద్రబాబు కొడుకే కదా! నేనేదో గూండానో, దావూద్ ఇబ్రహీంనో చీకట్లో కలిసినట్టు మాట్లాడతావు. లోకేశ్‌తో నేను కలిసినట్టు చెబుతుంటావు కానీ అలాంటి సంగతి ఏమీ లేదు. అయినా కలిస్తేనేం అవుతుంది?’’ అని ప్రశ్నించారు.
ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, తనపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ‘‘నాపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారు, చివరికి గుండు సూదంత ఆధారం చూపలేరు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే నాకు లింక్ పెట్టడం ఏంటీ?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 20 నెలలుగా పాలన మర్చిపోయి పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. నా విషయానికి వస్తే ఒక్కసారి డ్రగ్స్ అంటాడు, మరోసారి కారు రేసింగ్ అంటాడు. ప్రజలు గాసిప్‌ల మాయలో పడిపోయి ఆరు గ్యారెంటీలను మర్చిపోతున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
రాజకీయ విమర్శల పేరుతో యూట్యూబ్ కంటెంట్‌కు కావాల్సిన అంశాలే చెబుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే దిశగా రేవంత్ పనిచేయడం లేదని విమర్శించారు. బనకచర్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి పూర్తిగా అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన భేటీలో బనకచర్ల అంశం ప్రస్తావనకు రాలేదని చెబుతూనే అబద్ధం చెబుతున్నారని ధ్వజమెత్తారు.
అంతేకాదు, చంద్రబాబుతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని, త్వరలో ఆ హామీలు ఫుట్‌బాల్ బంతులా తిప్పబడతాయని హెచ్చరించారు.




