హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ భూమి ప్రభుత్వానికి చెందిందంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఈ భూమికి సంబంధించి గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొనసాగనుంది.లోతుకుంటలోని సుమారు 40 ఎకరాల భూమిపై తెలంగాణ ప్రభుత్వం, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థ మధ్య కొంతకాలంగా న్యాయ వివాదం కొనసాగుతోంది. సదరు భూమి తమకు చెందినదని నిర్మాణ సంస్థ వాదించగా.. ప్రభుత్వం మాత్రం అది ప్రభుత్వ భూమి అని పేర్కొంది. ఈ వివాదంపై శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, గతంలో సంస్థకు అనుకూలంగా తీర్పు వెలువడింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్ దాఖలు చేయడంలో 219 రోజుల ఆలస్యం జరిగినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ఈ ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండా డిస్మిస్ చేసింది. జస్టిస్ దీపంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.సుప్రీంకోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో 40 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రస్తుతం కొనసాగనుంది. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయపరంగా కీలకంగా మారింది. అయితే సుప్రీంకోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేయడం ప్రధానంగా పిటిషన్ దాఖలులో జరిగిన ఆలస్యానికి సంబంధించిన అంశంగా ఉండటం గమనార్హం.
ఇదే భూమి వివాదంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు గతంలో వివాదానికి దారితీశాయి. భూమిలో ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారని, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టారని శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులోనూ విచారణ జరిగింది.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు ఎలా చేపట్టారనే అంశంపై హైకోర్టు అధికారుల తీరుపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. కూల్చివేతల వ్యవహారానికి సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనను పదవి నుంచి బదిలీ చేసి, సమర్థవంతమైన అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు సమాచారం.అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో రంగనాథ్‌పై చర్యలకు సంబంధించిన అంశం కూడా న్యాయపరమైన ప్రక్రియలో కొనసాగుతోంది.
తాజాగా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని డిస్మిస్ చేయడంతో లోతుకుంటలోని 40 ఎకరాల భూమి వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు తీర్పు ప్రస్తుతం అమల్లో కొనసాగనుండటంతో తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.


