22ఏ అక్రమాలపై విచారణకు ఆదేశిస్తారా?.. సీఎం భేటీపై ఆసక్తి

Must read

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సభా సమావేశాలు ముగియాల్సి ఉండగా, మరో రోజు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బుధవారం కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది.

ఆదివారం, సోమవారం, మంగళవారం సభకు విరామం ప్రకటించారు. మూడు రోజుల విరామం అనంతరం బుధవారం అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. బుధవారం సభలో ఎల్‌నినో అంశంపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ చర్చ అనంతరం సభను వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చలు జరిగాయి. ముఖ్యంగా 22ఏ నిషేధిత భూముల అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకోవడంతో సభలోనూ రాజకీయ వేడి కనిపించింది.

మంగళవారం సీఎం రేవంత్ కీలక భేటీ

మరోవైపు ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రధానంగా 22ఏ నిషేధిత భూముల అంశంపైనే ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

22ఏ జాబితాలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న అక్రమాలు, అవకతవకలపై విచారణ జరిపించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో 22ఏ జాబితాలో పొరపాట్లు, భూ రికార్డులకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో.. వాటిపై తదుపరి చర్యలపై సీఎం మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

22ఏ భూముల విషయంలో విచారణకు ఆదేశించాలా? ఒకవేళ విచారణ చేపడితే ఏ స్థాయిలో నిర్వహించాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై మంత్రుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి తెలుసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో మంగళవారం జరగనున్న మంత్రుల సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇటీవల అసెంబ్లీలో 22ఏ భూముల అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 22ఏ నిబంధన కొత్తగా తీసుకురాలేదని, గతంలోనే అమల్లోకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అలాగే నిషేధిత భూముల జాబితాలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు అంగీకరించిన మంత్రి.. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో ధరణి వ్యవస్థలో భూ సమస్యలు ఏర్పడ్డాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం 22ఏ భూముల విషయంలో ప్రస్తుత ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కింది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులతో జరపనున్న భేటీలో 22ఏ భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక ఇప్పటికే చేపట్టిన చర్యలతోనే సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తుందా? అనేది సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!