‘మా అడ్డా’ అంటూ టీడీపీ.. ‘తొక్కించుకోవడానికి సిద్ధంగా లేం’ అంటున్న వైసీపీ!

Must read

హిందూపురం.. నందమూరి బాలకృష్ణకు రాజకీయంగా బలమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందిన ప్రాంతం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరుగుతోంది. టీడీపీ నేతలు హిందూపురం తమకు బలమైన అడ్డా అంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ నేతలు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలు ఇస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికలు రెండు పార్టీల మధ్య మరోసారి రాజకీయ పోరుకు వేదికగా మారుతున్నాయి.హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. ప్రతి ఎన్నికలోనూ ఆయన మెజార్టీ పెరగడం టీడీపీకి నియోజకవర్గంలో ఉన్న బలాన్ని సూచిస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కొనసాగిన సమయంలోనూ బాలకృష్ణ హిందూపురంలో విజయం సాధించడం టీడీపీ శ్రేణులకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

నియోజకవర్గ అభివృద్ధి విషయంలో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్న అభిప్రాయం స్థానిక టీడీపీ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా తాగునీటి సమస్యతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకురావడంపై ఆయన దృష్టి పెట్టారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాలు స్థానిక ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారతాయని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఈసారి కూడా మున్సిపాలిటీపై పట్టు సాధించాలని వైసీపీ స్థానిక నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో హిందూపురం మున్సిపల్ ఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి.

ఇక మున్సిపాలిటీ పరిధిలో వార్డుల సంఖ్యను 38 నుంచి 52కు పెంచడంతో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. వార్డుల రిజర్వేషన్లు, చైర్మన్ పదవి రిజర్వేషన్ ఎలా ఉంటుందనే దానిపై అన్ని పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తుది రిజర్వేషన్లపై స్పష్టత రాకముందే ఆయా సామాజిక వర్గాల ఆధారంగా అభ్యర్థులపై పార్టీల్లో చర్చలు మొదలైనట్లు సమాచారం.

వైసీపీకి అసలు సవాల్ అంతర్గత విభేదాలేనా?

టీడీపీకి ఎదురుగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడం కంటే ముందు వైసీపీ తన ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు ఆ పార్టీ స్థానిక వర్గాల్లో వినిపిస్తున్నాయి. బాలకృష్ణ వరుస విజయాలకు టీడీపీ బలంతో పాటు వైసీపీలోని అంతర్గత బలహీనతలు కూడా కారణమయ్యాయని కొందరు స్థానిక నాయకులు విశ్లేషిస్తున్నారు.హిందూపురం వైసీపీలో కీలకంగా ఉన్న నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి వంటి నేతల సస్పెన్షన్ కూడా పార్టీపై ప్రభావం చూపిందనే చర్చ స్థానికంగా ఉంది. ఇన్ఛార్జ్ కురుబ దీపికతో వారికి విభేదాలు కొనసాగిన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం వారిపై చర్యలు తీసుకుంది. ఈ ముగ్గురు నేతలు భవిష్యత్‌లో హిందూపురం రాజకీయాల్లో కీలక పాత్ర కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ కూడా ఉంది.

గతంలో పార్టీ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించడం, ఇన్ఛార్జ్ నాయకత్వాన్ని వ్యతిరేకించడం వంటి కారణాలతో నవీన్ నిశ్చల్, వేణుగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చర్యల వల్ల పార్టీకి ఉన్న స్థానిక నాయకత్వ బలం తగ్గిందనే అభిప్రాయం కూడా కొందరు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.ఇటీవల వైసీపీ ముఖ్య నేతలు స్థానిక కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు, ఒత్తిళ్లకు భయపడవద్దని, స్థానిక ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరేయాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ రౌడీ సినిమా సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది.

అయితే రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే. బలమైన ప్రత్యర్థి ఉన్న నియోజకవర్గంలో భారీ డైలాగులు, రాజకీయ పిలుపులు మాత్రమే సరిపోతాయా? లేక ముందుగా పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని బలమైన కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావాలా? అనేదే.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!