సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు సర్కార్.. కార్తిక దీపం వివాదంలో బిగ్ ట్విస్ట్.. అసలేం జరిగిందంటే!

Must read

Karthigai Deepam Controversy: తమిళనాడులోని ప్రసిద్ధ మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించే అంశంలో తలెత్తిన వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది. ఈ ఏడాది కొండపై ఉన్న పురాతన రాతి స్తంభంపై కార్తిక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం తాజాగా సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు తెలిపింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో అధికారికంగా అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో ఎదురైన ఇబ్బందులను న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లింది.

ఆలయ ట్రస్టీల అభ్యంతరంతోనే పాత పద్ధతిలోనే మహాదీపం:

తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న సిక్కందర్ దర్గా సమీపంలోని రాతి స్తంభంపై దీపం(Karthigai Deepam Controversy) వెలిగించాలనే అంశంపై గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. అయితే, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసేందుకు తాను అన్ని విధాలా ప్రయత్నించానని మదురై జిల్లా కలెక్టర్ సుప్రీంకోర్టుకు వివరించారు. రాతి స్తంభం వద్ద దీపాన్ని వెలిగిస్తే తరతరాలుగా వస్తున్న ఆగమ, ఆలయ సంప్రదాయాలు దెబ్బతింటాయని ఆలయ ట్రస్టీలు, యంత్రాంగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. వారి అనుమతి లేకపోవడం వల్లే మంగళవారం రాతి స్తంభంపై దీపం వెలిగించలేకపోయామని, ఎప్పటిలాగే ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే మహాదీపాన్ని వెలిగించాల్సి వచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కోర్టు ధిక్కరణ పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు:

మరోవైపు, తమ ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించిందని, దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించి చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ప్రభుత్వ వివరణ, కలెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పిటిషనర్ల అభ్యర్థనలను తోసిపుచ్చింది. దీంతో ఈ వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article