Gold Spot Re Launch: భారతదేశంలో ఒకప్పుడు ఆరెంజ్ సాఫ్ట్ డ్రింక్ అంటేనే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే ఐకానిక్ స్వదేశీ బ్రాండ్ ‘గోల్డ్ స్పాట్’ దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుత తరం వినియోగదారుల్లో ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ, అవగాహనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ‘లో-షుగర్’ లేదా పూర్తిగా ‘షుగర్ ఫ్రీ’ వేరియంట్లలో దీనిని రీ-లాంచ్ చేసేందుకు శీతల పానీయాల దిగ్గజ సంస్థ కోకా-కోలా సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. పాత తరం నాస్టాల్జియాను మళ్లీ గుర్తుచేసి వినియోగదారులను ఆకట్టుకునేలా దీని పాపులర్ ట్యాగ్‌లైన్ “ది జింగ్ థింగ్”ను సైతం కొనసాగించాలని కంపెనీ యోచిస్తోంది.
రిలయన్స్ పోటీని తట్టుకునేందుకే వ్యూహాత్మక అడుగు:
1971లో ప్రారంభమైన స్వదేశీ బ్రాండ్ గోల్డ్ స్పాట్(Gold Spot Re Launch)ను 1993లో థమ్స్ అప్, లిమ్కా, మాజా బ్రాండ్లతో పాటు కోకా-కోలా కొనుగోలు చేసింది. అయితే, తన సొంత ఆరెంజ్ డ్రింక్ ‘ఫాంటా’కు ఇది గట్టి పోటీగా మారడంతో 2000 సంవత్సరంలో గోల్డ్ స్పాట్ విక్రయాలను కోకా-కోలా నిలిపివేసింది. తాజాగా భారత మార్కెట్లో రిలయన్స్ ‘క్యాంపా’ బ్రాండ్ నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీని ఎదుర్కొని, మార్కెట్ వాటాను కాపాడుకునేందుకు కోకా-కోలా ఈ పాత అస్త్రాన్ని మళ్లీ బయటకు తీస్తోంది.
ప్రచారకర్తగా మహేంద్ర సింగ్ ధోనీ?
ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫోటో ముద్రించి ఉన్న ‘గోల్డ్ స్పాట్’ క్యాన్‌ను ఆయన సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో, ఈ బ్రాండ్‌కు ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1.40 లక్షల కోట్లుగా ఉన్న దేశీయ నాన్-ఆల్కహాలిక్ బెవరేజెస్ మార్కెట్, 2030-31 నాటికి ఏకంగా రూ.2.56 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనాలు వేస్తున్న తరుణంలో కోకా-కోలా తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.




