Vijayanagaram Parishad Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠభరితంగా సాగిన స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల ఫలితాలలో ప్రతిష్టాత్మక స్థానాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. విజయనగరం జిల్లా రాజకీయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేసింది. స్థానిక సంస్థల ఫలితాల్లో విజయనగరం జిల్లా వ్యాప్తంగా హోరాహోరీ పోరు సాగినప్పటికీ, బొండపల్లి మండలంలో టీడీపీ(Vijayanagaram Parishad Results) తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది.
బొత్స అనూషపై విజయం.. 5,136 ఓట్ల భారీ మెజార్టీతో పాసల నీరజ గెలుపు:
ఈ ఎన్నికల కౌంటింగ్లో టీడీపీ అభ్యర్థి పాసల నీరజ ప్రారంభ రౌండ్ల నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. సమీప వైసీపీ ప్రత్యర్థి బొత్స అనూషపై పాసల నీరజ ఏకంగా 5,136 ఓట్ల మెజార్టీతో సంచలన విజయం సాధించారు. ప్రధాన ప్రత్యర్థుల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించినప్పటికీ, మొదటి నుంచీ టీడీపీ అభ్యర్థికే ఓటర్లు పట్టం గట్టడంతో భారీ ఆధిక్యం సాధ్యమైంది.
తెదేపా శ్రేణుల సంబరాలు.. శుభాకాంక్షల వెల్లువ:
బొండపల్లి జడ్పీటీసీగా పాసల నీరజ గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించగానే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల బాణాసంచా కాల్చి, తీపి పదార్థాలు పంచుకుంటూ విజయ ఉత్సవాలు నిర్వహించారు. స్థానిక నేతలు, కార్యకర్తలు విజేత నీరజకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.


