Kuppam-Srikakulam Airport: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, విమానయాన రంగాన్ని విస్తరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో కొత్తగా రెండు విమానాశ్రయాల నిర్మాణానికి ప్రాథమిక అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పం, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు స్థల అనుమతి (Kuppam-Srikakulam Airport) ఇవ్వడంతో, ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (APADCL) త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపింది.
రూ.750 కోట్లతో శ్రీకాకుళం, రూ.1,142 కోట్లతో కుప్పం ఎయిర్‌పోర్టుల నిర్మాణం:
శ్రీకాకుళం విమానాశ్రయాన్ని రూ.750.52 కోట్ల అంచనాతో, 1,185 ఎకరాల విస్తీర్ణంలో 2030 నాటికి పూర్తి చేయాలని మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మరోవైపు కుప్పం ఎయిర్‌పోర్ట్ రెండు దశల్లో మొత్తం రూ.1,142 కోట్ల అంచనా వ్యయంతో 1,788 ఎకరాల్లో అందుబాటులోకి రానుంది. దీనికోసం ఇప్పటికే 1,300 ఎకరాల భూసేకరణ పూర్తి కాగా, భూసేకరణకు రూ.198.75 కోట్లు, మౌలిక వసతులకు రూ.146 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
9 కొత్త ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనలు.. పీపీపీ విధానంపై ఏపీ ప్రభుత్వం యోచన:
రాష్ట్రవ్యాప్తంగా అమరావతి, అనంతపురం, నాగార్జున సాగర్, ఒంగోలు సహా మొత్తం 9 విమానాశ్రయాలను రూ.6,418 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, తొలి విడతగా ఈ రెండింటికి అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టులను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) లేదా ఇతర నమూనాలలో నిర్మించాలా అనే దానిపై స్పష్టత వచ్చాక టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేయనున్నారు.


