Kadapa ZPTC-MPTC Elections: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో అనూహ్య తీర్పులు వెలువడుతున్నాయి. మెజారిటీ జడ్పీటీసీ, ఎంపీటీసీ (Kadapa ZPTC-MPTC Elections)స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, వైకాపా అతికొద్ది స్థానాలకే పరిమితమైంది. అయితే వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం ఎంపీటీసీ పరిధిలో మాత్రం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచే రీతిలో విభిన్నమైన ఫలితం వెలువడి అందరి దృష్టినీ ఆకర్షించింది.
జనసేన అభ్యర్థిపై 373 ఓట్ల మెజారిటీ.. కూటమి అంతర్గత విభేదాలే కారణమా?
తాళ్లమాపురం స్థానంలో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శిగినేని సుబ్బమ్మ తన సమీప ప్రత్యర్థి, జనసేన పార్టీ అభ్యర్థి వీరం మౌనికపై 373 ఓట్ల మెజారిటీతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. మొత్తం పోలైన 2,976 ఓట్లలో సుబ్బమ్మకు దక్కిన ఈ విజయంపై మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో ఇక్కడ జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక నిధులు ప్రకటించినప్పటికీ, కూటమి అభ్యర్థుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, అసంతృప్తే ఈ స్వతంత్ర అభ్యర్థి గెలుపునకు ప్రధాన కారణమని స్థానికంగా చర్చ జరుగుతోంది.


