Tiger Shroff Firing Case : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు పోలీస్ కస్టడీలో ఉన్నారు.. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు తొలుత టార్గెట్ చేసింది టైగర్ ష్రాఫ్‌ను కాదట.. కానీ, ముంబైకి వచ్చిన తరువాత తమ ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చిందట.
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన నిందితులు తొలుత మరో ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీని లక్ష్యంగా చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే, ముంబైకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని చేరుకోవడం కష్టమని భావించి తమ లక్ష్యాన్ని మార్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అభిమానులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, ఇన్స్టాగ్రామ్ పేజీల ద్వారా టైగర్ ష్రాఫ్ కదలికల గురించి తెలుసుకుని ఆయనను లక్ష్యంగా చేసుకున్నట్లు విచారణలో పేర్కొన్నట్లు సమాచారం.
నిందితులు టైగర్ ష్రాఫ్ ఎక్కడికి వెళ్తారు? ఆయనకు ఎలాంటి భద్రత ఉంటుంది? అనే వివరాలను తెలుసుకునేందుకు సోషల్ మీడియాను ఉపయోగించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా, ప్రతి ఆదివారం ముంబైలోని జుహూలో ఉన్న ఫుట్‌బాల్ మైదానానికి టైగర్ వస్తుంటారని అభిమానులు పెట్టిన పోస్టుల ద్వారా తెలుసుకున్నారు.
టైగర్‌కు పోలీసుల భద్రత తక్కువగా ఉందని భావించిన నిందితులు ఆయనను సులభంగా లక్ష్యంగా చేసుకోవచ్చని నిర్ణయించుకున్నట్లు విచారణ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత నటుడితో పాటు ఆయన అభిమానుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను కూడా పరిశీలిస్తూ ఆయన కదలికలపై నిఘా పెట్టినట్లు విచారణలో నిందితులు పేర్కొన్నట్లు సమాచారం.
అక్టోబర్ 18న ముంబైలోని జుహూలో ఫుట్‌బాల్ ఆడి తన కారులో బయటకు వస్తున్న సమయంలో టైగర్ ష్రాఫ్ వాహనంపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నటుడు, ఆయన డ్రైవర్ గాయపడ్డారు. డ్రైవర్‌కు బుల్లెట్ గాయం కాగా, టైగర్‌కు కూడా గాయాలైనట్లు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాల్పుల అనంతరం టైగర్ స్వయంగా కారు నడుపుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ముంబైకి తీసుకువచ్చి విచారిస్తున్నారు. ఈ దాడి వెనుక మరెవరైనా ఉన్నారా? నిందితులకు ఎవరి నుంచి ఆదేశాలు అందాయి? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తాము తొలుత టార్గెట్ చేసింది టైగర్ ష్రాఫ్‌ను కాదని.. మరో బాలీవుడ్ స్టార్ హీరోని అని పోలీసుల విచారణలో నిందితులు చెప్పినట్లు తెలిసింది.


