Yusuf Pathan Land Row : టీమిండియా మాజీ క్రికెటర్, లోక్‌సభ ఎంపీ యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. వడోదరలో ఆయన నివాసానికి పక్కనే ఉన్న వివాదాస్పద ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. మొత్తం 978 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం విలువ సుమారు రూ.20.53 కోట్లు ఉంటుందని అంచనా. 500 చదరపు మీటర్ల స్థలాన్ని ఆయనకు బహుమతిగా కేటాయించగా.. మిగిలిన 478 చదరపు మీటర్ల స్థలాన్ని రాయితీ ధరతో విక్రయించడానికి అంగీకరించింది.
Also Read : Abhijeet Dipke : దీపావళి వరకు నిరసనలకు బ్రేక్.. కార్యకర్తలకు అభిజీత్ దీప్కే కీలక విజ్ఞప్తి.. కారణమిదే..!
భూమి కేటాయింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (VMC) స్టాండింగ్ కమిటీ, జనరల్ బోర్డు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయంపై వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ్ మాట్లాడుతూ.. వడోదర ప్లాట్ కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిందని, ఈ ప్రతిపాదనను కమిటీ ముందు ఉంచుతామని తెలిపారు. కమిటీ ఆమోదం లభించిన తరువాత కేటాయింపు ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఇదిలాఉంటే.. యూసుఫ్ పఠాన్ టీఎంసీ పార్టీ వీడి ఎన్డీయేతో చేతులు కలిపిన కొన్ని నెలల్లోనే 14ఏళ్లుగా పోరాడుతున్న కేసులో ఆయనకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం వెలువడడం గమనార్హం.
2012 నుంచి కొనసాగుతున్న భూ వివాదం..
యూసుఫ్ పఠాన్ ఈ స్థలాన్ని కేటాయించాలని 2012లోనే వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌ను కోరారు. తన నివాసానికి ఆనుకుని ఉన్న ఈ భూమిని 99 ఏళ్ల లీజుపై బహిరంగ వేలం లేకుండా కేటాయించాలని అప్పట్లో ప్రతిపాదన వచ్చింది. అయితే, 2014లో గుజరాత్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ తర్వాత ఈ స్థలంపై వివాదం కొనసాగింది. భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో 2024లో మున్సిపల్ కార్పొరేషన్ చర్యలకు ఉపక్రమించింది. స్థలాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. దీనిపై యూసుఫ్ పఠాన్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
2025 ఆగస్టు 21న హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అనంతరం ఆయన డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. 2026 జూన్‌లో విచారణ సందర్భంగా, చట్టబద్ధమైన కేటాయింపు, చెల్లింపులు లేకుండానే ప్రభుత్వ భూమి ఆక్రమణలోకి ఎలా వచ్చిందని కోర్టు యూసుఫ్ పఠాన్‌ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో మున్సిపల్ అధికారుల పాత్రపైనా ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో ఆగస్టు 31న యూసుఫ్ పఠాన్ తన అప్పీల్‌ను ఉపసంహరించుకున్నారు. తాజాగా గుజరాత్ ప్రభుత్వం భూమి కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


