భక్తిశ్రద్ధలతో 11 రోజుల ఉత్సవాలు నిర్వహించాలి.. గణేష్ ఉత్సవ కమిటీలకు ఈటల సూచన

Must read

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 47వ వార్షికోత్సవ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల ప్రాధాన్యత, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు ఉత్సవాల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఆయన మాట్లాడారు.భారతదేశంలో ప్రజలను ఐక్యం చేయడంలో, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని కాపాడటంలో గణేష్ ఉత్సవాలకు ప్రత్యేకమైన స్థానం ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందించడంలో గణేష్ ఉత్సవాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.బ్రిటిష్ పాలన కాలంలో ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రజా ఉత్సవాలుగా నిర్వహించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని ఈటల గుర్తుచేశారు. ఆ రోజుల్లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను సమీకరించడంలో ఈ ఉత్సవాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు.ఆనాడు ప్రారంభమైన ఈ సంప్రదాయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించిందని అన్నారు. ప్రతి గ్రామం, ప్రతి బస్తీ, ప్రతి పట్టణంలో కోట్లాది మంది ప్రజలు గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకుని భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

గణేష్ ఉత్సవాలను ప్రజల విశ్వాసానికి, భక్తికి అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లేందుకు రామ్ రెడ్డి, శశి, ఉత్సవ కమిటీ చేస్తున్న కృషిని ఈటల రాజేందర్ అభినందించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించేందుకు కమిటీ చేస్తున్న సేవ ప్రశంసనీయమని అన్నారు.ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్న నాయకులు, అధికారులకు ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం, పోలీసు, విద్యుత్ శాఖల సమన్వయం అవసరమని అన్నారు.గణేష్ ఉత్సవ కమిటీలన్నీ 11 రోజుల పాటు ప్రశాంతమైన, భక్తి భావంతో కూడిన వాతావరణంలో వేడుకలను నిర్వహించాలని ఎంపీ కోరారు. భక్తులు కూడా ఉత్సవాల సందర్భంగా క్రమశిక్షణ పాటించి నిర్వాహకులకు, అధికారులకు సహకరించాలని సూచించారు.ముఖ్యంగా గణేష్ మండపాలు, ఊరేగింపుల సమయంలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈటల సూచించారు. విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

పోలీసు శాఖ, విద్యుత్ శాఖ, ఇతర సంబంధిత అధికారులు ఉత్సవాల సమయంలో నిరంతరం పర్యవేక్షిస్తూ గణేష్ ఉత్సవ కమిటీలకు అవసరమైన సహకారం అందించాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా భారీ ఊరేగింపులు, రద్దీ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా గణేష్ ఉత్సవాలు విజయవంతంగా జరగాలని ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులు, ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!