ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్రమైన సేవల్లో ఒకటిగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో ఆయన పాల్గొన్నారు. శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో పవన్ కల్యాణ్ ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
గురువాయూర్ ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం దక్షిణ ముఖద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన ఆయన.. స్వామివారి నిర్మాల్య దర్శనంలో పాల్గొన్నారు. గర్భగుడిలో మూలవిరాట్‌కు నిర్వహించే ప్రత్యేక కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో తిలకించారు.ముందురోజు స్వామివారికి అలంకరించిన అలంకరణను తొలగించి, ఉదయం తొలి దర్శనాన్ని భక్తులకు కల్పించే సేవను నిర్మాల్య దర్శనంగా పిలుస్తారు. ఈ సేవలో పాల్గొనడం విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తారు. దాదాపు 30 నిమిషాల పాటు పవన్ కల్యాణ్ ఈ ప్రత్యేక దర్శనంలో పాల్గొన్నారు.
నిర్మాల్య దర్శనం అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వామివారికి నిర్వహించే వివిధ సేవల గురించి ఆలయ అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరించారు. నువ్వుల నూనెతో తైలాభిషేకం, శంభాభిషేకం, వాకచార్థు తదితర సేవల విశిష్టతను ఆయనకు తెలియజేశారు. ముందు రోజు స్వామివారికి అలంకరించిన గంధాన్ని తొలగించి అభ్యంగన స్నానం చేయించే సంప్రదాయాన్ని కూడా అధికారులు వివరించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ నైరుతి భాగంలో ఉన్న వినాయకుడిని దర్శించుకున్నారు. ఆలయ ఆచారాలను అనుసరిస్తూ ఆలయం వెనుక భాగంలో సాష్టాంగ నమస్కారం చేశారు.
తదుపరి ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి, అనంత పద్మనాభ స్వామి, భగవతి అమ్మవార్లను పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయ ప్రదక్షిణలో భాగంగా శ్రీ అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్శనం అనంతరం గురువాయూర్ ఆలయ మేల్ శాంతితో పాటు ఇతర ప్రధాన అర్చకులు పవన్ కల్యాణ్‌ను ఆశీర్వదించారు. స్వామివారి కళభం, ఇతర ప్రసాదాలను ఆయనకు అందజేశారు. ఆలయ దర్శనం సందర్భంగా పవన్ కల్యాణ్ వెంట ఆయనకు ఆయుర్వేద థెరపీ అందించిన వైద్యులు కూడా ఉన్నారు.
గురువాయూర్ శ్రీ బాలకృష్ణ స్వామివారి దర్శనం సందర్భంగా పవన్ కల్యాణ్ సంప్రదాయబద్ధమైన ఆలయ ఆచారాలను పాటిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేకువజామున జరిగిన నిర్మాల్య దర్శనం, స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ, ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవతామూర్తుల దర్శనంతో ఆయన పర్యటన ఆధ్యాత్మికంగా సాగింది.


