తెలంగాణ అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ను ఆశ్రయించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ శుక్లాను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కేటీఆర్ తెలిపారు.అసెంబ్లీ పరిసరాల్లో మహిళా శాసనసభ్యులపై పోలీసులు దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధుల పట్లే ఇలాంటి వ్యవహారం చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
ఎమ్మెల్సీల సస్పెన్షన్‌పైనా ఫిర్యాదు
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసిన అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కేటీఆర్ తెలిపారు. సభా నిబంధనలకు విరుద్ధంగా తమ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకున్నారని గవర్నర్ శుక్లాకు వివరించినట్లు చెప్పారు.ఇటీవల అసెంబ్లీ, శాసనమండలిలో చోటుచేసుకున్న వరుస పరిణామాలతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు, ఎమ్మెల్సీల సస్పెన్షన్, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వ్యవహారశైలి వంటి అంశాలపై ఇరు పార్టీల మధ్య తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి.
ఫామ్‌హౌస్ ఘటనను కూడా ప్రస్తావించిన కేటీఆర్
అసెంబ్లీ ఘటనల తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను కూడా గవర్నర్‌కు వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఫామ్‌హౌస్ వైపు వెళ్లిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రతిపక్ష నేతల నివాసాల వైపు వెళ్లడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.సభ వెలుపల చోటుచేసుకున్న ఘటనలపై గవర్నర్ శుక్లా డీజీపీ, పోలీస్ కమిషనర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు. దీంతో పోలీసుల వ్యవహారశైలిపై తమ ఫిర్యాదుకు గవర్నర్ స్పందించారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
‘బ్లాక్ టీషర్ట్ వేసుకుంటే తప్పేంటి?’
అసెంబ్లీకి బ్లాక్ టీషర్ట్ ధరించి వచ్చిన అంశంపైనా కేటీఆర్ స్పందించారు. రాహుల్ గాంధీ గతంలో పార్లమెంట్‌కు బ్లాక్ టీషర్ట్ ధరించి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాము కూడా అదే విధంగా బ్లాక్ టీషర్ట్ వేసుకున్నామని చెప్పారు. ఇందులో తమ తప్పేమిటని ప్రశ్నించారు.


