Monday, September 7, 2026

ప్రభాస్‌ను కలిసిన క్షణం.. మైండ్ బ్లాంక్ అయిపోయింది: సుమంత్ ప్రభాస్

Must read

టాలీవుడ్ యువ నటుడు సుమంత్ ప్రభాస్ తన అభిమాన హీరో, రెబల్ స్టార్ ప్రభాస్‌ను తలుచుకుంటూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘రోమాంచకం’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న సుమంత్ ప్రభాస్.. చిన్నప్పటి నుంచి తాను ఆరాధించే ప్రభాస్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సక్సెస్ మీట్‌లో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక ఫేవరెట్ హీరో ఉంటారని, తనకు మాత్రం చిన్నప్పటి నుంచే ప్రభాస్ అంటే ఎంతో అభిమానం అని చెప్పారు. తాను ఆరో, ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచే ప్రభాస్‌ను చూడాలని, ఆయనను కలవాలని కలలు కనేవాడినని తెలిపారు. ఆ కల నిజమైన రోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని భావోద్వేగానికి గురయ్యారు.

నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చొరవతోనే ప్రభాస్‌ను కలిసే అవకాశం తనకు లభించిందని సుమంత్ తెలిపారు. అంత పెద్ద సూపర్‌స్టార్‌ ఎదురుగా వెళ్లి నిలబడినప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదని, కొంతసేపు ప్రభాస్‌తో మాట్లాడుతున్నప్పటికీ తన మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయిందని చెప్పారు. ఆ క్షణాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు.

ప్రభాస్ తనను సొంత తమ్ముడిలా భావించారని సుమంత్ తెలిపారు. తనను ప్రోత్సహిస్తూ, ఇంత పెద్ద హీరోను కలిసే అవకాశం కల్పించిన ప్రణయ్ రెడ్డి వంగాకు రుణపడి ఉంటానని అన్నారు.

ప్రభాస్‌తో దాదాపు 40 నిమిషాల పాటు ఉన్నామని సుమంత్ చెప్పారు. తనతో కలిసి క్యూబ్‌లో సినిమా చూస్తానని ప్రభాస్ మాట ఇచ్చారని తెలిపారు. తన స్నేహితులు బయట ఉన్నారని, వారిని లోపలికి అనుమతించవద్దని చెప్పినప్పుడు.. ప్రభాస్ స్వయంగా బయటకు వచ్చి వారిని ఇంట్లోకి రమ్మని పిలిచారని సుమంత్ గుర్తుచేసుకున్నారు. వారికి స్నాక్స్ పెట్టించి, ఫొటో కూడా ఇచ్చారని చెప్పారు.

ఈ విషయాలను గుర్తుచేసుకుంటూ సుమంత్ ప్రభాస్‌పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. “బంగారం రా ప్రభాస్” అంటూ ఆయన ఎమోషనల్‌గా చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్‌తో తనకున్న అభిమాన బంధాన్ని సుమంత్ ఎంతో ఆప్యాయంగా వివరించడంతో ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ‘రోమాంచకం’ సినిమా విజయంపై సుమంత్ ప్రభాస్ స్పందిస్తూ.. తెరపై తాను ఇంతగా కామెడీ చేయగలనని తన స్నేహితులు కూడా ఊహించలేదని చెప్పారు. సినిమాలో తన కామెడీకి వస్తున్న స్పందనకు పూర్తి క్రెడిట్ దర్శకుడు వేణుకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు థియేటర్లలో పడి పడి నవ్వుతుంటే ఎంతో సంతృప్తిగా ఉందని తెలిపారు.

సినిమా క్లైమాక్స్‌లో దర్శకుడు అనుదీప్ ఎంట్రీ ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని సుమంత్ చెప్పారు. ఆయన కామెడీ టైమింగ్‌కు థియేటర్లలో భారీగా నవ్వులు, కేరింతలు వినిపించాయని, ఆ సందడిలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినిపించనంతగా థియేటర్లు ఎరప్ట్ అయ్యాయని వివరించారు.

ఈ సినిమా విజయానికి మొత్తం టీమ్ కృషి కారణమని సుమంత్ పేర్కొన్నారు. అనంతిక, నరేంద్ర రవి, సోహన్, మణి, కాస్ట్యూమ్స్‌తో పాటు నటనలోనూ భాగమైన కీర్తన, ఖుషి తదితరుల సమిష్టి కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ‘రోమాంచకం’ సక్సెస్ సందర్భంగా సుమంత్ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!