కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన పరిణామం వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు కొండా సురేఖ అనుచర వర్గంలో ఆందోళన నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు కూడా తాజా పరిణామాలపై అసంతృప్తితో మౌనంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో వరంగల్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది.మంత్రి పదవిలో ఉన్న సమయంలో కొండా సురేఖకు అండగా నిలిచిన అనుచరులు.. ఆమెను పదవి నుంచి తొలగించిన తర్వాత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమపై కూడా పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ఆందోళనతో కొందరు అనుచరులు బహిరంగ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో నామినేటెడ్ పదవులు పొందిన కొండా అనుచరుల్లో ఈ భయం మరింత ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తమకు కేటాయించిన పదవులకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనన్న ఆందోళనతో కొందరు అనుచరులు ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె అనుచరులకు దక్కిన కొన్ని ఏజెన్సీల విషయంలోనూ అధికారుల దృష్టి పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో భవిష్యత్తులో తమపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనే విషయంలో కొండా అనుచర వర్గంలో టెన్షన్ నెలకొన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. వరంగల్ కాంగ్రెస్‌లో మరో వర్గంలోనూ అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొండా సురేఖకు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచిన కొందరు సీనియర్ నేతలు తమకు కీలకమైన పదవులు దక్కుతాయని ఆశించినట్లు సమాచారం. అయితే తాజాగా గుండు సుధారాణికి కూడా ఛైర్మన్ పదవి దక్కడంతో వారి అంచనాలు తారుమారైనట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో వరంగల్ మేయర్‌గా పనిచేసిన గుండు సుధారాణికి పార్టీ మారిన వెంటనే కీలకమైన ఛైర్మన్ పదవి దక్కడంపై కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తాము పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తూ.. అధిష్టానం నిర్ణయాలకు మద్దతుగా నిలిచినా తమను పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు కేటాయించడంపై కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మరోవైపు ఛైర్మన్ పదవిపై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జంగా రాఘవరెడ్డి పేరు కూడా ఈ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ అనుచర వర్గానికి ఛైర్మన్ పదవి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.
కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన వెంటనే కొందరు కాంగ్రెస్ నేతలు సంబరాలకు సిద్ధమైనట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే గుండు సుధారాణికి ఛైర్మన్ పదవి దక్కడంతో ఆ వర్గాలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాము ఆశించిన పదవులు దక్కకపోవడంతో కొందరు నేతలు ప్రస్తుతం మౌనంగా ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.దీంతో వరంగల్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం రెండు రకాల అసంతృప్తి కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు కొండా సురేఖకు సన్నిహితంగా ఉన్న నేతలు, అనుచరులు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు పార్టీ అధిష్టానానికి మద్దతుగా నిలిచిన కొందరు సీనియర్లు తమకు తగిన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖ బర్తరఫ్‌తో వరంగల్ కాంగ్రెస్‌లో ఒక రాజకీయ అధ్యాయం ముగిసిందా? లేక కొత్త సమీకరణాలకు ఇది నాంది పలుకుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.




