రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లపై బీఆర్‌ఎస్‌ ఫోకస్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు?

Must read

తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. 2027 మార్చిలో ఖాళీ కానున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలకు ముందస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండు స్థానాలకు సంబంధించి కొత్తగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. నవంబర్ 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించగా.. అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6 వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారు కూడా తాజా జాబితాలో చేరేందుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 30న ప్రకటించనున్నారు.
ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల దృష్టి ఈ రెండు స్థానాలపై పడింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలకు ముందుగానే సంస్థాగతంగా సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ 22న తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, శాసనసభలో ఆ పార్టీ ఉపనేత హరీశ్‌రావు ఆధ్వర్యంలో పార్టీ నేతలతో సమావేశం జరిగింది. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, నియోజకవర్గాల వారీగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి.

ఆ రెండు స్థానాలపై ప్రత్యేక దృష్టి

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు చెందిన సురభి వాణీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గానికి కాంగ్రెస్‌కు చెందిన చింతపండు నవీన్‌ కుమార్‌ (తీన్మార్ మల్లన్న) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరి పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది.ఈ రెండు స్థానాలు ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించి ఉండటంతో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల నమోదు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సాధారణ అసెంబ్లీ నియోజకవర్గాల మాదిరిగా కాకుండా ప్రత్యేక ప్రక్రియ ద్వారా రూపొందుతుంది.

సామాజిక సమీకరణాలపై చర్చ?

ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్‌ఎస్‌లో సామాజిక సమీకరణాలపై అంతర్గత చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక స్థానాన్ని ఓసీ, మరో స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి కేటాయించే అంశంపై ఆలోచన జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.వరంగల్–ఖమ్మం–నల్గొండ స్థానానికి ఓసీ అభ్యర్థిని, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానానికి బీసీ అభ్యర్థిని పరిశీలించే అవకాశం ఉందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే తుది నిర్ణయంలో సామాజిక సమీకరణాలతో పాటు అభ్యర్థుల రాజకీయ అనుభవం, గ్రాడ్యుయేట్ ఓటర్లతో ఉన్న సంబంధాలు, పార్టీతో అనుబంధం, నియోజకవర్గ స్థాయి పరిచయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ముందుగానే అభ్యర్థుల ప్రకటన?

ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసి ఎన్నికల కసరత్తును వేగవంతం చేయాలనే ఆలోచన బీఆర్‌ఎస్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులు ముందుగానే రంగంలో ఉంటే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియపై కూడా పార్టీ శ్రేణులు దృష్టి పెట్టే అవకాశం ఉందన్నది ఆ పార్టీ అంతర్గత అంచనా.ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎన్నికల రోల్‌ తయారీ షెడ్యూల్‌పై స్పష్టత కోరుతూ తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఓటర్ల నమోదు షెడ్యూల్, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ మధ్య ఉన్న అంశాలపై పార్టీ నేతలు వివరణ కోరారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!