Friday, September 4, 2026

22ఏ బాధితుల భూముల కోసం బీజేపీ దీక్ష.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Must read

ప్రజల భూములను నిషేధిత జాబితా అయిన సెక్షన్ 22ఏలో చేర్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. ఈ క్రమంలో రేపు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ దీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 22ఏ బాధితులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. ప్రజలు ఒక రకమైన భయంలో జీవిస్తున్నారని అన్నారు. హైడ్రా పేరుతో వేలాది ఇళ్లను కూల్చివేసి పెద్దల జీవితాల్లో మట్టి కొట్టారని ఆరోపించారు. మూసీ బాధితులకు కూడా బీజేపీ అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.సెక్షన్ 22ఏ అంశంపై స్పందించిన ఈటల రాజేందర్.. గతంలో నిషేధిత జాబితాలో 16 లక్షల ఎకరాలు ఉండగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది 80 లక్షల ఎకరాలకు పెరిగిందని ఆరోపించారు. అపార్ట్మెంట్లు, కాలనీలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిషేధిత జాబితాలో చేర్చారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను కూడా 22ఏ జాబితాలో చేర్చారని విమర్శించారు.

ఈ సమస్యపై బాధితుల తరఫున బీజేపీ నిరంతర పోరాటం చేస్తుందని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి నాయకత్వంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి రేపు ఉదయం 10 గంటల నుంచి ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపడతారని వెల్లడించారు.22ఏ బాధితులందరూ ఈ దీక్ష కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా బాధితులకు అండగా నిలిచి వారిని దీక్షా కార్యక్రమానికి తీసుకురావాలని కోరారు.

ఈ దీక్ష ప్రభుత్వానికి కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల భూములను సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.22ఏ జాబితాలో తమ భూములు చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు ఈ దీక్షపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు, హక్కులు, ఇతర లావాదేవీల విషయంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. బీజేపీ నిర్వహించనున్న ఈ దీక్షతో 22ఏ భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!