Thursday, June 11, 2026
Google search engine

భారత్‌ను విశ్వగురువుగా నిలబెడతారని బండి సంజయ్ విశ్వాసం

Must read

భారత రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త అధ్యాయాన్ని లిఖించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ పేర్కొన్నారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా నెహ్రు పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించడం భారత రాజకీయాల్లో చారిత్రక ఘట్టమని కొనియాడారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్, మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని అన్నారు. భారతదేశ ప్రజలు వరుసగా మూడు సార్లు మోదీకి మద్దతు ఇవ్వడం ఆయనపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో తొలిసారిగా దేశ అత్యున్నత కార్యనిర్వాహక పదవిని చేపట్టినప్పటి నుంచి నిరంతరాయంగా దేశ పాలనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన 4,399 రోజుల ప్రధానమంత్రి పదవీకాలాన్ని పూర్తి చేసి, నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించినట్లు బండి సంజయ్ గుర్తు చేశారు. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు. దేశ ప్రజలు ఒక నాయకుడిపై ఉంచిన నమ్మకం, అభివృద్ధి పట్ల వారి విశ్వాసానికి ఇది నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు.

మోదీ తీసుకున్న నిర్ణయాలు భారతదేశాన్ని అంతర్జాతీయంగా మరింత ప్రభావవంతమైన దేశంగా మార్చాయని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. విదేశాంగ విధానం, ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశ ప్రతిష్ఠను పెంచాయని అన్నారు. పంచంలోని ప్రముఖ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తున్నాయని, పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక రంగంలో భాగస్వామ్యాలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.

‘విశ్వగురు’గా భారత్

భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, ప్రజాస్వామ్య విలువలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా మారుతోందని, భవిష్యత్తులో ‘విశ్వగురు’ స్థానాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

“భారతదేశం కేవలం ఆర్థిక శక్తిగానే కాకుండా జ్ఞానం, సంస్కృతి, విలువల పరంగా కూడా ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటుంది. ఆ దిశగా మోదీ తీసుకుంటున్న చర్యలు కీలక పాత్ర పోషిస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.

మోదీ రికార్డు సాధనపై అధికార పార్టీ సంబరాలు జరుపుకుంటుండగా, ప్రతిపక్షాలు మాత్రం దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయినప్పటికీ వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందడం మోదీ రాజకీయ బలాన్ని ప్రతిబింబిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నాయకుడు ఇంతకాలం ప్రజల మద్దతుతో ప్రధానిగా కొనసాగడం అరుదైన విషయమని వారు పేర్కొంటున్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!