ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం రెపరెపలాడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన పర్యావరణ పురస్కారాల్లో ఒకటైన ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమానికి దక్కడం రాష్ట్రానికే కాకుండా దేశానికీ గర్వకారణమని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, రైతులు, గ్రామీణ మహిళల అంకితభావంతో కూడిన కృషికి ప్రపంచ వేదికపై లభించిన గౌరవమే ఈ పురస్కారమని మంత్రి తెలిపారు. ఈ అవార్డును ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న లక్షలాది మంది రైతులు, మహిళలు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు.స్వీడన్‌లోని బస్తాద్ నగరంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహణ అధికారి తల్లం విజయ్ కుమార్ ఈ పురస్కారాన్ని స్వీకరించారని మంత్రి తెలిపారు. ప్రపంచ ఆహార వ్యవస్థలో పర్యావరణ అనుకూల మార్పులకు దోహదపడుతున్న వినూత్న కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డు అందజేశారని పేర్కొన్నారు.
దశాబ్దం క్రితం ప్రారంభమైన ఏపీ ప్రకృతి వ్యవసాయ ఉద్యమం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ పర్యావరణ కార్యక్రమాల్లో ఒకటిగా ఎదిగిందని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా సాగు చేయడం ద్వారా వాతావరణ మార్పులు, పర్యావరణ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఏపీ నిరూపించిందన్నారు.
ప్రకృతి వ్యవసాయం రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు నేల సారం పెంపు, జీవ వైవిధ్య పరిరక్షణ, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గింపులో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రూపొందించిన ప్రకృతి వ్యవసాయ నమూనా ప్రస్తుతం దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ అమలవుతుండటం ఈ విధానం ప్రపంచానికి ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు. ఈ విజయానికి గ్రామీణ మహిళల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. స్వయం సహాయక సంఘాల మహిళలు రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించడంలో ప్రధాన శక్తిగా నిలిచారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు మార్గదర్శకులుగా పనిచేస్తున్న కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, పరిశోధకుల సేవలు అభినందనీయమని మంత్రి ప్రశంసించారు.
వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ, అధికారులు, శాస్త్రవేత్తలు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో సాధించిన విజయమిదని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ అంతర్జాతీయ గుర్తింపు ద్వారా ప్రకృతి వ్యవసాయ విస్తరణకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధనలు, ప్రపంచ దేశాలతో జ్ఞాన మార్పిడి, రైతులకు కొత్త అవకాశాల కల్పనకు ఈ పురస్కారం బలమైన వేదికగా నిలుస్తుందని చెప్పారు.
“ఇది కేవలం ఒక అవార్డు కాదు.. సుస్థిర వ్యవసాయం, రైతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ సాధించిన విజయానికి ప్రపంచం అందించిన గౌరవం” అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.



