హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కుమురం భీం ఆదివాసీ భవన్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోందన్నారు.
ఇది సాధారణ కార్యక్రమం కాదని, తెలంగాణ మహిళల ఆర్థిక భవిష్యత్తును మార్చే ఉద్యమమని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో సగభాగం మహిళలదేనని, వారి భాగస్వామ్యం లేకుండా దేశ సంపద పెరగడం సాధ్యం కాదన్నారు. పేదరికం తగ్గాలంటే ప్రతి కుటుంబంలో మహిళకు ఆదాయం రావాలని, మహిళలు కేవలం పొదుపు సంఘాల సభ్యులుగానే కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమేనని, ఆ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు ఆ దిశలో భాగమని చెప్పారు.
మహిళా సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. మధిరలో మహిళలకు రూ.3 కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్లు అందించగా, వాటి ద్వారా నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తోందని వెల్లడించారు. అలాగే మహిళలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల ద్వారా నెలకు రూ.4 లక్షల వరకు లాభాలు వస్తున్నాయని చెప్పారు.
స్త్రీశక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేలా తెలంగాణ మహిళలు ముందుకు వస్తున్నారని పేర్కొన్న మంత్రి, మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.60 వేల కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని వెల్లడించారు. మహిళా సంఘాలు 100 శాతం రుణాల చెల్లింపుతో జీరో ఎన్‌పీఏ సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
బిట్స్ పిలానీ, టీ-హబ్ సహకారంతో రూ.20 కోట్ల వ్యయంతో మహిళల కోసం రెండు ప్రత్యేక ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి కేవలం శిక్షణ కేంద్రాలు మాత్రమే కాకుండా, ఆదాయం సృష్టించే కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 6.5 లక్షల మహిళలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, తెలంగాణను మహిళా వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చేర్యాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు నెదర్లాండ్స్ వరకు చేరాయని గుర్తు చేశారు. “మన మూలాలు స్థానికమైనవే కావచ్చు, కానీ మన లక్ష్యం ప్రపంచ స్థాయిలో ఉండాలి” అని పిలుపునిచ్చారు.
మహిళలు ఉద్యోగాల కోసం వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని మంత్రి స్పష్టం చేశారు. “ఉద్యోగాలు కోరేవారిగా కాదు… ఉద్యోగాలు కల్పించే వారిగా మహిళలు మారాలి” అని అన్నారు. ఈ ఇంక్యుబేటర్ల ద్వారా వందలాది మందిని కాదు, లక్షలాది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, క్రమశిక్షణలో మరింత ఎదగాలని, ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహిళలను గౌరవించడం సమాజ పురోగతికి పునాది అని పేర్కొన్నారు.



