ఈరోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొని కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ భవిష్యత్తు, ఆర్థిక స్వావలంబన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాజకీయ కోణంలో వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలు తమ చరిత్రను ఒకసారి గుర్తుచేసుకోవాలని ఆయన అన్నారు. 1949లో నెహ్రూ బియ్యం, రొట్టెల వాడకం తగ్గించాలని ప్రజలకు సూచించారని, 1962 చైనా యుద్ధ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ సేవలను గుర్తించి రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆహ్వానించారని తెలిపారు. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి వారానికి ఒక పూట భోజనం మానాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు.
అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను అణచివేసి బలవంతపు కుటుంబ నియంత్రణ అమలు చేశారని ఆరోపించారు. అలాగే 1967లో ఇందిరాగాంధీ, 2013లో చిదంబరం దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బంగారం కొనొద్దని ప్రజలకు సూచించారని, ఆర్థిక సంక్షోభ సమయంలో మన్మోహన్ సింగ్ “ఖర్చులను తగ్గించుకోవాలి” అని చెప్పారని పేర్కొన్నారు.వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణతోనే దేశం బలపడుతుందని రాంచందర్ రావు అన్నారు. సౌరశక్తి పంపులు వాడటం, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడం, ప్రజా రవాణా వినియోగం, “స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం”, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాని సూచనల్లో తప్పేముందని ప్రశ్నించారు. ఇవి దేశ ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా పాటించాల్సినవే తప్ప బలవంతపు ఆంక్షలు కాదన్నారు.
ప్రపంచవ్యాప్త సంక్షోభం కారణంగా అమెరికా, కెనడా వంటి దేశాల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయని, పాకిస్తాన్, శ్రీలంకల్లో ఇంధన రేషన్ అమలవుతోందని తెలిపారు. అయినప్పటికీ యూపీఏ ప్రభుత్వం వదిలివెళ్లిన చమురు బాండ్ల భారాన్ని మోస్తూనే మోదీ ప్రభుత్వం దేశంలో ఇంధన ధరలను స్థిరంగా ఉంచిందన్నారు.యూపీఏ పాలనతో పోలిస్తే ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 10వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకుందని, పన్ను మినహాయింపు రూ.2 లక్షల నుంచి రూ.12.75 లక్షలకు పెరిగిందని చెప్పారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు 11 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గాయని, మౌలిక వసతుల వ్యయం, దేశ సంపద, విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయని తెలిపారు.
బీజేపీ ఎల్లప్పుడూ “దేశమే మొదటి ప్రాధాన్యం” అనే సిద్ధాంతంతో పనిచేస్తుందని, కాంగ్రెస్‌కు మాత్రం “అధికారమే మొదటి ప్రాధాన్యం” మాత్రమే ముఖ్యమని రాంచందర్ రావు విమర్శించారు. దేశ ప్రయోజనాల ముందు రాజకీయాలు పనికిరావని, ప్రధాని సూచనలను ప్రతి పౌరుడు బాధ్యతగా పాటించాలని కోరారు.



