Friday, June 26, 2026

ఖరీఫ్-2026కు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ :మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

Must read

రాష్ట్రంలో ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయశాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.

2026-27 సంవత్సరానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రూ.294 కోట్ల బడ్జెట్‌తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై సరఫరా చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఖరీఫ్–2026 సీజన్‌కు అవసరమైన 93 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను గత సంవత్సరాల మాదిరిగానే 50 శాతం రాయితీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. మిగిలిన అవసరాల కోసం టీజీఎస్ డీసీ, హెచ్ఐఎల్, ఎన్ఎస్ సీ, ఆంగ్రూ సంస్థల ద్వారా అదనపు విత్తనాల సేకరణ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలే అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2025-26 సంవత్సరం నుంచి గ్రామీణ విత్తనోత్పత్తి పథకానికి ప్రత్యామ్నాయంగా కొత్త విత్తన రకాల పెంపొందించడానికి తోడ్పాటు అనే సవరించిన సమగ్ర పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1,03,901 క్వింటాళ్ల విత్తనోత్పత్తి జరిగిందని, 2026-27 సంవత్సరానికి 1,20,678 క్వింటాళ్ల విత్తనోత్పత్తి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

గత ప్రభుత్వం 2019-20 నుంచి 2023-24 వరకు రాయితీ విత్తనాలు సరఫరా చేసిన సంస్థలకు రూ.476.94 కోట్ల బకాయిలు ఉంచిందని మంత్రి విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తి చెల్లింపులు ఇప్పటికే విడుదల చేసిందని, 2025-26 సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు.

రైతులకు వివిధ పంటలపై ఆకర్షణీయమైన రాయితీలు కొనసాగిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వరి విత్తనాలకు జిల్లాల వారీగా క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు రాయితీ, చిరుధాన్యాలకు 50 శాతం, పప్పుధాన్యాలకు 30 శాతం, శనగలకు 25 శాతం, వేరుశనగ మరియు నువ్వులకు 40 శాతం, పచ్చిరొట్ట ఎరువు విత్తనాలకు 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజన రైతులకు 90 శాతం వరకు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో 80 శాతం వరకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!