Saturday, June 6, 2026
Google search engine

“మే నెల తల్లిదండ్రులకు పీడకలగా మారింది”.. కవిత ఆవేదన

Must read

తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నా నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఫీజుల నియంత్రణ కోసం ఈ నెలలోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన “నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ” అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను భారీగా దోచుకుంటున్నాయని, కానీ ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని మండిపడ్డారు. ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. “ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ల ప్రారంభోత్సవాలకు వెళ్లి వారిని ప్రోత్సహిస్తున్నారు” అని కవిత వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించడం దురదృష్టకరమని ఆమె అన్నారు. విద్యారంగంలో ప్రజల సమస్యలు అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై కూడా ప్రభుత్వం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలను వెంటనే ఆపాలని హెచ్చరించారు.ప్రస్తుతం తెలంగాణలో ప్రతి ప్రైవేట్ స్కూల్‌లో 50 నుంచి 120 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారని కవిత ఆరోపించారు. పుస్తకాలు, యూనిఫారాలు, ట్రాన్స్‌పోర్ట్, ప్రత్యేక ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారీ భారం మోపుతున్నారని తెలిపారు. “మే నెల అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు పీడకలగా మారింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తమ పిల్లలకు మంచి విద్య అందించాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజమని, కానీ అదే బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ విద్యాసంస్థలు వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబాల ఆదాయంలో 60 నుంచి 70 శాతం వరకు విద్య, వైద్యం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విద్యా సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా ఫీజులు పెంచకుండా జీవో జారీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

త్వరలోనే తమతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామని వెల్లడించారు. “మేము కొత్తగా ఏమీ అడగడం లేదు. గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలనే ఇప్పుడు అమలు చేయమంటున్నాం” అని ఆమె స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పలువురు తల్లిదండ్రులు కూడా తమ సమస్యలను వెల్లడించారు. ప్రతి ఏడాది ఫీజుల పెంపుతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని వాపోయారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. విద్యారంగంలో నియంత్రణ లేకపోవడం వల్ల ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విద్యావేత్తలు కూడా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పర్యవేక్షణ బలహీనంగా ఉండటం వల్లే పరిస్థితి ఇంత దారుణంగా మారిందని పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!