ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “చైల్డ్ సేఫ్టీ – ప్రొటెక్షన్ & సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని ఆఫ్టర్‌కేర్ పిల్లలకు కీలక ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం బాలల రక్షణ, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం లక్ష్యంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు అపర్ణ చందన, సరిత, వందన, వచన్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి, ఈగల్ ఫోర్స్ అధికారులు గిరిధర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లలో నివసిస్తున్న విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఆఫ్టర్‌కేర్ విద్యార్థులకు ఆధార్, ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆరోగ్యశ్రీ కార్డులు వంటి కీలక పత్రాలను మంత్రి సీతక్క అందజేశారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1055 మంది పిల్లలకు ధ్రువపత్రాలు మంజూరు చేయడం విశేషంగా నిలిచింది.అలాగే ఈగల్ ఫోర్స్ తరఫున విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేసి, “సే నో టు డ్రగ్స్” పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటివరకు ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ఆఫ్టర్‌కేర్ పిల్లలు ఇకపై స్వతంత్ర జీవితంలోకి అడుగుపెడుతున్నారని తెలిపారు.
వారి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం స్వయంగా అందజేస్తోందని మంత్రి పేర్కొన్నారు. గతంలో సర్టిఫికెట్ల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్యలను పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం ముందడుగు వేసిందని వివరించారు.“ఈ ధ్రువపత్రాలు కేవలం కాగితాలు కావు… ఇవే మీ భవిష్యత్తుకు బాటలు వేసే సాధనాలు” అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కుటుంబ ఆదరణ లేకపోయినా కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చిన విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. “మీ జీవితాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించే వారు ఉంటారు… కానీ మీరు మంచి లక్ష్యంతో ముందుకు సాగాలి” అని ఆమె సందేశమిచ్చారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని పేర్కొంటూ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలను చేరవేస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే వేలాది ధ్రువపత్రాలు అందజేయడం జరిగిందని, మిగతా ప్రక్రియలు కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసదుపాయం అందుతున్నదని, బాలల భద్రత, పునరావాసం, విద్య, మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
చివరగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ప్రతి చిన్నారి భద్రంగా ఉండాలి… ప్రతి యువకుడు సరైన దిశలో ఎదగాలి… ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి. అదే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడుతుంది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, అధికారులు, విద్యార్థులను మంత్రి అభినందిస్తూ, ప్రభుత్వం, అధికారులు, సామాజిక సంస్థలు కలిసి ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.



