Friday, June 26, 2026

లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల అసమతౌల్యత తొలగిస్తాం: అమిత్ షా

Must read

దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో ఉన్న తీవ్ర అసమతౌల్యతను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై జరిగిన చర్చకు సమాధానంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉండగా, మరికొన్ని చోట్ల చాలా తక్కువగా ఉండటం ప్రజాస్వామ్య సమానత్వానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలోని మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేవలం 60 వేల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని అమిత్ షా వెల్లడించారు. ఇంత భారీ వ్యత్యాసం ఉండడం వల్ల ఒక ఎంపీ తన నియోజకవర్గ ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరించడం కష్టమవుతుందని అన్నారు. నియోజకవర్గాల పరిమాణాన్ని సమతుల్యం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన ప్రతినిధిత్వం కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు సహా మూడు కీలక బిల్లులను ప్రభుత్వం మహిళా సాధికారత, ప్రజాస్వామ్య సమానత్వం దిశగా ముందడుగుగా తీసుకువచ్చిందని అమిత్ షా తెలిపారు. ఈ బిల్లులపై లోక్‌సభలో సమగ్ర చర్చ జరిగిందని, 130 మంది ఎంపీలు మాట్లాడారని, అందులో 56 మంది మహిళా సభ్యులు పాల్గొన్నారని చెప్పారు. ఈ చర్చ దేశ ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మల్కాజ్‌గిరి, ఢిల్లీ, బెంగళూరు వంటి అధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో అదనపు లోక్‌సభ స్థానాలు ఏర్పడే అవకాశముందని అమిత్ షా వెల్లడించారు. దీంతో ప్రజలకు మరింత సమీపంగా ప్రజాప్రతినిధులు పని చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఎంపీల నిధుల వినియోగం కూడా మరింత సమర్థవంతంగా జరిగేలా ఈ మార్పులు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. 1972లో ఇందిరా గాంధీ లోక్‌సభ సీట్ల సంఖ్యను 545కు పెంచిన తర్వాత, దాదాపు ఐదు దశాబ్దాల పాటు డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు సాగనివ్వకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య సమతౌల్యాన్ని పక్కనబెట్టి రాజకీయ లాభాల కోసమే వారు వ్యవహరించారని విమర్శించారు.ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభజన రేఖలు గీయడానికి ప్రయత్నించడం బాధ్యతారాహిత్యమని అమిత్ షా హెచ్చరించారు. దేశం మొత్తం ఒకటేనని, ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడం సమంజసం కాదని అన్నారు. ప్రతి ప్రాంతానికీ దేశ పాలనలో సమాన హక్కులు ఉన్నాయని, సభ్యులందరికీ సమాన అధికారం ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!