Friday, June 26, 2026

ప్రజల భాగస్వామ్యంతో మూసి పునర్జీవనం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Must read

మూసి నది పునర్జీవనం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మూసి పునర్జీవనం పనుల పురోగతిపై ఆయన అధికారులతో సవివరంగా చర్చించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా ప్రజల అభిప్రాయాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. musrirdc@gmail.com మెయిల్ ఐడీ ద్వారా అందిన సూచనలు, సలహాలను సమగ్రంగా పరిశీలించి, వాటిపై దశలవారీగా స్పందిస్తామని చెప్పారు. ప్రజలు ఇచ్చే విలువైన అభిప్రాయాలను అధికారులతో కలిసి విశ్లేషించి, అవసరమైతే అభిప్రాయదారులతో నేరుగా సంప్రదింపులు జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.

మూసి నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి మార్చి 28న శంకుస్థాపన జరిగినట్లు గుర్తుచేస్తూ, ఆ రోజు నుంచే ఫేజ్-1, ఫేజ్-2 పనులకు సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్టు అమలు దశలో పనులను విభజించి, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

డిఫెన్స్ భూముల అంశం, పునరావాసితులతో సంప్రదింపులు, నిర్మాణ డిజైన్లను తుది దశకు తీసుకెళ్లడం, బ్యాంకర్లతో చర్చలు వంటి కీలక అంశాలను సమన్వయంతో నిర్వహించాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి దశలో పారదర్శకత, వేగం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలు చేయాలని, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. మూసి పునర్జీవనం ప్రాజెక్టు వారి సేవా జీవితాల్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అధికారులకు ఎలాంటి సందేహాలు, సలహాలు లేదా అవసరాలు ఉన్నా, మూసి సబ్ కమిటీ సభ్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని డిప్యూటీ సీఎం తెలిపారు. సమన్వయంతో పని చేస్తే ప్రాజెక్టు వేగంగా పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ రంజన్, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇవి నరసింహారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, అధికారులు వినయ్ కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, మన చౌదరి, జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!