రాష్ట్రంలో మెరుగైన ప్రజారోగ్యం సాధన కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఏప్రిల్ నెల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతి నెల నాలుగో శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం, నారావారిపల్లెలో విజయవంతంగా అమలవుతున్న ఈ ప్రాజెక్టును జూలై నాటికి రాష్ట్రమంతటా విస్తరించాలని స్పష్టం చేశారు. ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు. పరీక్షల ఫలితాలను 48 గంటల్లోనే వాట్సాప్ ద్వారా నేరుగా ప్రజలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమం కోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్లు అవసరమవుతాయని, ఇందుకు సుమారు రూ.162 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు వివరించగా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ డేటాబేస్‌లో నమోదు అయ్యారని అధికారులు వెల్లడించారు. ప్రతి వ్యక్తిగత హెల్త్ రికార్డు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు తగ్గించేందుకు ప్రివెంటివ్ హెల్త్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు.
యోగ, పోషకాహారం, ధ్యానం, ప్రాణాయామం వంటి ఆరోగ్యపరమైన అలవాట్లను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సీఎం సూచించారు. ఇవి అనేక ఆరోగ్య సమస్యలకు ముందస్తు పరిష్కారంగా నిలుస్తాయని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు అమలవుతున్న చిత్తూరు జిల్లాలో ప్రజారోగ్యం ఎంత మేర మెరుగుపడిందో సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా, త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని అనే ఐదు ప్రధాన అంశాలతో ఈ పాలసీ రూపొందించనున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుపై కూడా సమీక్ష నిర్వహించారు.
యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామ్యం కావడానికి పలు బీమా సంస్థలు ముందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూడా సీఎం చర్చించారు. వైద్యారోగ్య శాఖలో ఎక్కడా ఖాళీలు లేకుండా రేషనలైజేషన్ ద్వారా వాటిని వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.
ఫార్మసీ నెట్వర్క్, ల్యాబొరేటరీల సమన్వయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలకు అవసరమైతేనే సిజేరియన్ చేయాలని, సాధ్యమైనంతవరకు సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో సిజేరియన్ శాతం 20 శాతానికి మించితే ఆడిటింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ పాల్గొన్నారు.



