రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి రోడ్లు కీలక పునాది అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో రోడ్లు భవనాల శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్ లక్ష్యాలపై మాట్లాడిన ఆయన, మంచి రోడ్లు ఉంటే పెట్టుబడులు పెరిగి ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. రోడ్ల అభివృద్ధి వల్ల మార్కెట్ సౌకర్యాలు మెరుగుపడి పరిశ్రమలు విస్తరించి సమగ్ర ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధి రైతులకు పంటలను మార్కెట్‌కు సులభంగా తరలించే అవకాశాన్ని కల్పిస్తుందని, విద్యార్థులు విద్య కోసం సౌకర్యవంతంగా ప్రయాణించగలరని, అత్యవసర పరిస్థితుల్లో రోగులు సమయానికి ఆసుపత్రులకు చేరుకుని ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన చెప్పారు.
దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల ప్రమాదాలు జరిగి 1.6 లక్షల మంది మరణించారని, తెలంగాణలో 22,441 ప్రమాదాలు జరిగి 6,221 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రోజుకు సగటున 18 నుంచి 20 మంది మరణించడం విచారకరమని, ముఖ్యంగా యువతే ఎక్కువగా బలవుతున్నారని అన్నారు. ఇటీవల చేవేళ్ల–మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. డబ్బు పోతే తిరిగి వస్తుందని, కానీ ప్రాణం పోతే తిరిగి రాదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా “ఆరైవ్ అలైవ్” వంటి కార్యక్రమాలు చేపట్టి రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రోడ్ల అభివృద్ధి అనేది కేవలం మౌలిక సదుపాయాల నిర్మాణం కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 34,062 కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్ ఉందని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 7,590 కోట్లతో 1,835 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపట్టినట్లు, 76 భారీ వంతెనల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. గత 27 నెలల్లో వందల కిలోమీటర్ల రోడ్లు, పలు వంతెనలు పూర్తి చేసినట్లు వివరించారు.
హైబ్రిడ్ అన్యుటీ విధానం ద్వారా రాష్ట్రంలో 12,000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. మొదటి దశలో 6,092 కిలోమీటర్ల రోడ్లను సుమారు రూ. 13,006 కోట్ల వ్యయంతో 30 నెలల్లో నిర్మించి, 15 సంవత్సరాల పాటు నిర్వహణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ విధానం ద్వారా మెరుగైన నాణ్యత, దీర్ఘకాలిక నిర్వహణ, పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల విస్తరణ, అమరావతి–బందరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని తెలిపారు. అదేవిధంగా చెన్నై, పూణే, బెంగళూరు నగరాలను కలుపుతూ అధిక వేగ రైలు మార్గాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇక ఉస్మానియా ఆస్పత్రి, కొత్త హైకోర్టు భవనాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా రూ. 8,000 కోట్ల వ్యయంతో నాలుగు ఆధునిక ఆస్పత్రులను నిర్మిస్తున్నామని, సనత్‌నగర్‌లో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రి త్వరలో ప్రారంభ దశకు చేరుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. “మంచి రోడ్డు అంటే ఆర్థిక అభివృద్ధి, సురక్షిత జీవితం, ప్రజల భవిష్యత్తు” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ప్రసంగంలో స్పష్టం చేశారు.



