'వాల్తేరు వీరయ్య' కచ్చితంగా మెగా ఉత్సవమే అంటున్న ఫ్యాన్స్!
చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ 'వాల్తేరు వీరయ్య' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. చిరంజీవి ఈ సినిమాలో జాలరి గూడెం నాయకుడిగా పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నారు. మాస్ రోల్స్ లో చిరంజీవి బాడీ లాంగ్వేజ్ .. డైలాగులు ..స్టెప్పులు చూడముచ్చటగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.
అలాంటి పూర్తి మాస్ లుక్ తో చిరంజీవి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఈ సినిమాలో తన ఏజ్ చాలా వరకూ తగ్గిపోయిందనీ .. మళ్లీ 'గ్యాంగ్ లీడర్' రోజులకు వెళ్లిపోయినట్టుగా అనిపించిందని ఇటీవల చిరంజీవి అనడం మెగా ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. 'నువ్వు శ్రీదేవైతే .. నేను చిరంజీవంటా' పాటలో నిజంగానే ఆయన చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు.
ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు జనంలోకి దూసుకుని వెళ్లాయి. ప్రతి పాట కూడా జనాలకు కనెక్ట్ అయింది. అన్ని పాటలను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయడం విశేషం. తన స్టైల్ ను శేఖర్ మాస్టర్ బాగా పట్టేశాడని చిరంజీవి అనడాన్ని బట్టి చూస్తే, డాన్సులలో మెగా స్టార్ ఎలా చెలరేగిపోయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. శ్రుతి హాసన్ తో కలిసి తెరపై ఆయన చేసిన సందడి చూడటానికి అభిమానులంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా మెగా ఉత్సవమే అవుతుందనే అభిప్రాయాలు వాళ్ల నుంచి వినిపిస్తున్నాయి.
Share this article in your network!