'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాట ఆస్కార్ అవార్డును సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాటకు అకాడెమీ అవార్డు రావడంపై యావత్ దేశం ఆనందంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది భారతీయులంతా ఎంతో గర్వించదగ్గ సమయమని చిరంజీవి అన్నారు. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, తారక్, చరణ్, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. మనకు ఇంతటి కీర్తీని తీసుకొచ్చిన విజనరీ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.  

ఇదొక చారిత్రాత్మకమైన విజయమని చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. చరణ్ గురించి మాట్లాడుతూ... బిడ్డ ఎదుగుతుంటే ఏ తండ్రికైనా ఆనందంగానే ఉంటుందని చెప్పారు. గతంలో నార్త్ వాళ్లకు తెలుగు సినిమా అనేది తెలియదని... మనల్ని మదరాసీలు అనేవారని... ఆ స్థాయి నుంచి 'శంకరాభరణం' తదితర ఎన్నో చిత్రాల ద్వారా మన తెలుగు సినిమా గుర్తింపును తెచ్చుకుంటూ వచ్చిందని అన్నారు. ఆస్కార్ అవార్డు జడ్జ్ మెంట్ చాలా బాగుందని... నాటునాటుకు అవార్డు వస్తుందని ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ... ఏదో మూల చిన్న అనుమానం ఉండేదని.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆస్కార్ పొందడానికి ఈ పాట అన్ని విధాలా అర్హత కలిగి ఉందని... పాటకు అవార్డు ఇవ్వడంతో ఆస్కార్ కు ఆస్కారం ఉందనిపించిందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇది ఆరంభం మాత్రమేనని... రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.