ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ టెన్షన్ కొనసాగుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్త భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కుప్పంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు పాల్గొన్న రెండు సభల్లో జరిగిన విషాద ఘటనల్లో పలువురు మృతి చెందిన నేపథ్యంలో రోడ్ షోలు, సభలపై అధికార వైసీసీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సభలు, సమావేశాలకు కూడా మార్గదర్శకాలు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఇవన్నీ టీడీపీ, చంద్రబాబు సభలను అడ్డుకోవడానికే అని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.  

ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు తలపెట్టిన పర్యటన సాఫీగా సాగుతుందా? ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతాయా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు రోడ్‌షో, సభలకు వెళ్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తునారు. స్థానిక ఎమ్మెల్యేగా కుప్పంలో ఎక్కడైనా.. సభలు నిర్వహించే హక్కు చంద్రబాబుకు ఉందని చెబుతున్నారు. చంద్రబాబు సభను టీడీపీ నేతలు జరిపి తీరుతామంటున్నారు. తమను అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.