గోదారోళ్లు అంటే మ‌ర్యాద.. మ‌ర్యాద అంటే గోదారోళ్లు అన్నంత‌లా ఉంటుంది. మాట్లాడే విధానం చూసిన అతిథి మ‌ర్యాద వ‌ర‌కూ అన్నింటిలో మ‌ర్యాద ఉట్టిప‌డుతుంది. మాట‌కు ముందు గారు, మాట‌కు త‌ర్వాత గారు అంటూ మ‌ర్యాద‌కు మారు పేరుగా నిలుస్తుంటారు. 

ఇక మ‌రీ ముఖ్యంగా అల్లుళ్ల‌కు గోదారోళ్లు ఇచ్చే రెస్పెక్ట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. సంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే ఇక ఈ మ‌ర్యాద పీక్స్ లెవల్‌కు వెళుతుంది. ఇంటికి వ‌చ్చిన కొత్త అల్లుడిని ర‌క‌ర‌కాల భోజ‌నాల‌తో ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటారు. తాజాగా న‌ర‌సాపురంలో మ‌న‌వ‌రాలికి, ఆమె ఫియాన్సీకి ఓ తాత‌య్య ఇచ్చిన విందు భోజ‌నం నెట్టింట వైర‌ల్‌గా మారింది. 

న‌ర‌సాపురంకి చెందిన ఆచంట గోవింద్ నాగమణి దంపతులు తమ కూతురు అత్యం మాధవి, వెంకటేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె కుందవికి తణుకుకి చెందిన తుమ్మలపల్లి సాయి కృష్ణ తో ఇటీవ‌ల నిశ్చితార్థం అయ్యింది. ఈ క్ర‌మంలోనే కాబోయే నూత‌న వధూవరులకు, వధువు తాత‌య్య విందు ఏర్పాటు చేసి గోదారోళ్ల మ‌ర్యాద‌ను రుచి చూపించారు. ప్ర‌స్తుతం ఈ విందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో కాబోయే అల్లుడిని సంక్రాంతి భోజ‌నానికి ఆహ్వానించారు. ఇందులో భాగంగా స‌ద‌రు తాత‌య్య‌ ఏకంగా 365 వంట‌కాల‌తో గోదారోళ్ల మ‌ర్యాద ఎలా ఉంటుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. డైనింగ్ టేబుల్ మొత్తం ఏమాత్రం ఖాళీ లేకుండా అన్ని వంట‌కాల‌తో నిండిపోయింది. వీటిలో.. అన్నం, పులిహార, బిర్యానీలు, దద్దోజనం వంటి వంటకాలు తో పాటు, 30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్ధాలు, 15 రకాల ఐస్ క్రీంలు, 35 రకాల డ్రింక్ లు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకుల‌తో విందు ఏర్పాటు చేశారు.