ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) తో సమావేశంపై వైసీపీ (YSRCP) నేత, సినీ నటుడు ఆలీ (Actor Ali) స్పందించారు 

సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అలీ.. రాజ్యసభ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు రమ్మని పిలిచారని.. అందుకే సీఎంను కలిశానని ఆలీ తెలిపారు. అతి త్వరలోనే పార్టీ ఆఫీసు నుంచి శుభవార్త వస్తుందని తెలిపారు. ఏ పదవి ఇస్తారన్నది తనకు చెప్పలేదన్న ఆలీ.. నేనెప్పుడు పదవులు ఆశించకుండా పార్టీకి పనిచేశానన్నారు. సీఎం జగన్ తో నాకు చాలా పాత పరిచయం ఉందని... వైస్సార్ ఉన్నప్పటి నుండి జగన్ నాకు తెలుసని ఆలీ తెలిపారు. ఇటీవల పెళ్లి రోజున రావాలని అనుకున్నామని.. కానీ కుదరలేదన్నారు. 

గత ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్నారని ఆలీ.., టైం తక్కువ ఉండడంతో వద్దన్నానని తెలిపారు. ఎమ్మెల్యే అంటే గ్రౌండ్ నుండి వర్క్ చెయ్యాలన్న ఆలీ.., ఫేస్ వ్యాల్యూ బట్టి వర్కవుట్ అవ్వదనే తిరస్కరించినట్లు తెలిపారు. జగన్ తో జరిగిన భేటీ పూర్తి వ్యక్తిగతమని ఆలీ స్పష్టం చేశారు. ఇక ఇటీవల సినీ ప్రముఖులతో జరిగిన భేటీ సందర్భంగా హీరోలను అవమానించారంటూ వచ్చిన వార్తలపై ఆలీ స్పందించారు. సినీ ప్రముఖులని అవమాన పరచాల్సిన అవసరం జగన్ కి ఏముందని ఆయన ప్రశ్నించారు. సినీ ప్రముఖులకు ఇవ్వాల్సిన గౌరవం సీఎం జగన్ ఇస్తున్నారని.. కానీ ఆయనపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆలీ విమర్శించారు. చిన్న పెద్ద సినిమాలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా సీఎం నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. 

కొంతకాలంగా ఆలీకి రాజ్యసభ సీటు ఇస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. త్వరలో ఏపీ నుంచి ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలో చేరబోతున్నాయి. నాలుగు స్థానాల్లో ఒకటి మైనారిటీలకు ఇస్తారని.. అది కూడా ఆలీకి ఇస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తన్నాయి. ఈ నేపథ్యంలో ఆలీ వారంలో రెండోసారి సీఎంను కలవడం చర్చనీయాంశమవుతోంది. 

వైసీపీ తరపు నుంచి భర్తీకానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి మైనార్టీలకు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం, మండలి డిప్యూటీ ఛైర్మన్ వంటి కీలక పదవులిచ్చిన సీఎం.. ఎంపీ పదవి కూడా కట్టబెట్టాలని చూస్తున్నారట.. అందులో భాగంగానే ఆలీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆలీ వైసీపీలో చేరారు. ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వైసీపీకి దూరంగా ఉన్నా.. ఆలీ మాత్రం జగన్ కు జై కొట్టారు. 

రెండున్నరేళ్లుగా ఆయన పదవి కోసం ఎదరుచూస్తున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినట్లు ప్రచారం జరిగినా అదేమీ జరగలేదు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అవడం అందులో ఒకటి మైనార్టీలకు ఇవ్వాలని సీఎం అనుకుంటుండటంతో ఆలీ పేరు ముందువరసలో ఉంది. ఐతే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డితో పాటు ఓ బీసీ నేతకు సీటు ఖాయమైనట్లు తెలుస్తోంది. మరోసీటు ఎస్సీలకు, నాలుగో సీటు మైనారిటీలకు ఇస్తారని టాక్.