వర్షాకాలంలో తీసుకొనవలసిన జాగ్రత్తలపై మంత్రి సీతక్క సమీక్ష
రానున్న వర్షాలు, వరదల పరిస్థితిపై రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అధికారులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు ఉన్నాయి. ముందస్తుగా సమస్యలను గుర్తించి వాటిని పరిస్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ బగీరథ పథకంలో భాగంగా కొత్త కనెక్షన్ మరియు పాత కనెక్షన్ పై సమీక్షారు. పాత గృహాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. కుంటలు, చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని, చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల పారిశుద్ధ్య లోపము మరియు కలుషిత నీరు వలన అంటు వ్యాధులు ప్రబలే అవకాశము ఉంది. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హోటళ్ళు, మార్కెట్లు, దుకాణాలలో నిల్వ యుంచే వస్తువులపై నిఘా ఉంచాలని అన్నారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటే వాటిని తాత్కాలికముగా నిషేధించాలని అన్నారు. కోళ్ళ ఫారముల యాజమాన్యంతో పారిశుద్ధ్యపై వారిని అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో నీటి నిల్వలను తొలగించుట, గుంతలు పూడ్చుట మరియు నీటి నిల్వ ప్రాంతాలలో బ్లీచింగ్, ఫీనాయిల్ చల్లడం మొదలైనవి చేపట్టాలని సూచించారు. జిల్లా, డివిజనల్ పంచాయతి అధికారులు, సంబంధిత మండల పంచాయతీ అధికారులు ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశాలిచ్చారు. త్రాగు నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని అన్నారు. ఆరోగ్య శాఖ సహకారంతో ఓ.ఆర్.ఎస్. ద్రావణ ప్యాకెట్లు అందేటట్లు చర్యలు తీసుకురావాలి. వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలి అన్నారు.ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మహిళాశక్తి పథకం కింద పాఠశాల యూనిఫాం కుట్టడంపై దాదాపు పూర్తయిందని పాఠశాల ప్రారంభలోనే విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేస్తామని అన్నారు.ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ కమిషనర్, శాఖ పరమైన అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Share this article in your network!