ట్యాంక్ బండుపై ఘనంగా బతుకుమ్మ వేడుకలు
ట్యాంక్ బండుపై నేడు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. బతుకమ్మ పండుగ చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీరితోపాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, ప్రజా గాయని విమలక్క, ఎమ్మెల్సీ కోదండరాం, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేలాదిమంది మహిళలు రాష్ట్ర సచివాలయం ఎదురుగా గల ఆమరవీరుల స్మారక కేంద్రo నుండి బతుకమ్మలతో, వివిధ కళా రూపాల ప్రదర్శనలతో ట్యాంక్బండ్ పైకి ఊరేగింపుగా వచ్చారు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద మంత్రి సీతక్క తో పాటు మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ తదితరులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై దాదాపు 40 నిమిషాలకు పైగా ప్రదర్శించిన క్రాకర్స్, లేజర్ షోలు సందర్శకులను పెద్ద ఎత్తున ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు పర్యటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ వివిధ శాఖల అధికారులు శాఖా పరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Share this article in your network!