లోక్‌సభ ఎన్నికల ముందు కర్నాటకలోని సిద్ధరామయ్య సర్కారు మరో వివాదానికి తెరలేపింది. దేవాలయాలు ట్యాక్సులు కట్టాలంటోంది. ఈ మేరకు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపితే, కాషాయసేన గర్జిస్తోంది. అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించేందుకు ఉద్దేశించిన కొత్త ఎండోమెంట్స్ బిల్లుకు కర్నాటక అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం కోటి రూపాయలకు మించి ఆదాయం ఉన్న దేవాలయాలపై ప్రభుత్వం 10 శాతం పన్ను విధిస్తుంది. అదే సమయంలో 10 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఆదాయం ఉన్న ఆలయాలు ఐదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చింది. 

అయితే ఈ కొత్త ఎండోమెంట్స్ బిల్లుపై రాష్ట్ర బీజేపీ తీవ్రంగా మండిపడింది. సిద్ధరామయ్య ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబించడం ద్వారా తన ఖాళీ ఖజానాను నింపుకోవాలని చూస్తోందని విమర్శలు గుప్పించింది..కేవలం హిందూ దేవాలయ ఆదాయాలపైనే ప్రభుత్వం ఎందుకు పన్ను విధిస్తోందని ప్రశ్నించింది బీజేపీ. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయాన్ని కర్నాటక మంత్రి రామలింగారెడ్డి సమర్థించుకున్నారు. ప్రభుత్వం దేవాలయాల సొమ్ము తీసుకోవట్లేదని స్పష్టం చేశారు. ఇలా సేకరించిన మొత్తాన్ని ధార్మిక కార్యక్రమాలకే వినియోగిస్తామన్నారు..పేద అర్చకులకు ఆర్థిక సాయం, చిన్న దేవాలయాలను మెరుగు పరచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు..అప్పట్లో బీజేపీ ప్రభుత్వం కూడా 5 లక్షల నుంచి 25 లక్షల ఆదాయం ఉన్న దేవాలయాలపై 5 శాతం పన్ను, 25లక్షలు పైబడి ఆదాయం ఉన్న వాటిపై 10 శాతం పన్ను విధించిందని గుర్తుచేశారు.