ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని కీలక రైల్వే మార్గాల్లో రవాణా సామర్థ్యాన్ని పెంచడం, రైళ్ల రద్దీని తగ్గించడం, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా మొత్తం రూ.20,804 కోట్ల విలువైన ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.కేబినెట్ నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా రైల్వేల సమగ్ర ఆధునికీకరణ కొనసాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో భారీ రవాణా ఉండే మార్గాలతో పాటు ఏడు హైడెన్సిటీ రైల్వే కారిడార్లలో నాలుగు లైన్లు, క్వాడ్రప్లింగ్ పనులు చేపడుతున్నట్లు వివరించారు.ఈ ప్రాజెక్టుల్లో మూడు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు రూ.10,783 కోట్లతో ఆమోదం లభించింది. ఖరగ్‌పూర్–ఝార్సుగూడ (బాగ్‌దేహి) నాలుగో లైన్, కట్ని–పెండ్రా రోడ్ నాలుగో లైన్, బిలాస్‌పూర్ (ఉస్లాపూర్)–పెండ్రా రోడ్ మూడో లైన్ ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేయనున్నాయి.ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా సుమారు 656 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్ విస్తరించనుంది. దాదాపు 4,790 గ్రామాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ అందనుండగా, సుమారు 56 లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు కీలక ప్రాజెక్టులు
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మరో ఐదు ప్రాజెక్టులకు రూ.10,021 కోట్ల మేర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా సుమారు 540 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్ పెరగనుంది.అరకోణం–రేణిగుంట మార్గంలో 77 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్లు నిర్మించనున్నారు. వైట్‌ఫీల్డ్–బంగారుపేట మధ్య 47 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైన్లు చేపట్టనున్నారు. హోసూర్–ఓమలూరు మధ్య 147 కిలోమీటర్ల డబ్లింగ్, సేలం–కరూర్–దిండిగల్ మధ్య 159 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు.తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)–కాజీపేట మార్గంలో 110 కిలోమీటర్ల మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఈ ఐదు ప్రాజెక్టులు మొత్తం 17 జిల్లాల పరిధిలో కొనసాగనున్నాయి. సుమారు 2,121 గ్రామాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ అందనుండగా, దాదాపు 52 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు.
ప్రయాణికులకు, సరుకు రవాణాకు ప్రయోజనం
కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, మల్టీ-ట్రాకింగ్ పనులతో రైళ్ల రాకపోకలకు మరింత సామర్థ్యం లభించనుంది. ప్రస్తుతం రద్దీగా ఉన్న మార్గాల్లో అదనపు లైన్లు అందుబాటులోకి రావడంతో రైళ్ల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంది. దీంతో రైళ్ల సేవల విశ్వసనీయత మెరుగుపడటంతో పాటు రద్దీ కూడా తగ్గనుంది.ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. మల్టీమోడల్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
పర్యాటక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ
కొత్త రైల్వే ప్రాజెక్టులతో తిరుపతి, తిరుత్తణి, తిరుచానూరు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, హోగెనక్కల్ జలపాతాలు, హోసూర్ కోట, మేట్టూర్ డ్యామ్, కొడైకెనాల్, సత్యమంగళం వన్యప్రాణి అభయారణ్యం, యాదాద్రిగుట్ట, భువనగిరి కోట వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.
సరుకు రవాణా సామర్థ్యం పెంపు
ఈ మార్గాలు బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు, కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల రవాణాకు కీలకమైనవి. దక్షిణాది ఐదు ప్రాజెక్టుల ద్వారా ఏటా సుమారు 47 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని అంచనా.మరో మూడు ప్రాజెక్టుల ద్వారా అదనంగా సుమారు 27 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం పెరగనుంది. రైల్వే రవాణా పెరగడం ద్వారా లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గడంతో పాటు చమురు దిగుమతులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది.అలాగే రోడ్డు రవాణాపై ఆధారపడటం తగ్గడం ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టులు ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాలకు గణనీయమైన ప్రయోజనం చేకూర్చనున్నాయి.


