రాజకీయ ప్రత్యర్థుల చావు కోరుకోవడమేంటి?.. వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై కవిత ఫైర్

Must read

రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప.. వారి చావును కోరుకోవడం ఏమిటని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ప్రత్యర్థి నాయకులు, కులాలు, వ్యవస్థలను దూషించడం, దుర్భాషలాడటం వీర్లపల్లి శంకర్‌కు ఇదే తొలిసారి కాదని కవిత విమర్శించారు. అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుకుంటున్నట్టుగా వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై కవిత మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. తన పోస్టులో కేసీఆర్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను సిద్ధాంతపరంగా, రాజకీయంగా ఎదుర్కోవాలని.. వ్యక్తిగతంగా వారి ప్రాణాలను కోరుకోవడం వంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు.

ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి అధికార పార్టీ నాయకులు దండయాత్రకు వెళ్లడం ఏమిటని కూడా కవిత ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రే తన పార్టీ నాయకులను ఇలాంటి దాడులకు ఉసిగొల్పడం దారుణమని ఆమె విమర్శించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన వివాదాలతో అసెంబ్లీలో రెండు రోజుల విలువైన సభా సమయం వృథా అయిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో రాజకీయ ఘర్షణలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు.

పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి

మరోవైపు పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులతో జరిగిన సమావేశంలోనూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో కానిస్టేబుల్ అభ్యర్థులు కవితను కలిశారు. ఈ సందర్భంగా ఆమె నిరుద్యోగులు, పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులే ప్రధాన కారణమని కవిత అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా నిరుద్యోగులు ఊరూరా తిరిగి ప్రచారం చేశారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.

2024లో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నట్టు ప్రచారం చేసి జీవో నంబర్ 31 విడుదల చేశారని కవిత అన్నారు. వయోపరిమితిలో సడలింపు ఇస్తామని చెప్పి రెండేళ్లు గడిచిపోయాయని విమర్శించారు. ఈ ఆలస్యం కారణంగా ఎంతోమంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అర్హత కోల్పోయారని ఆమె పేర్కొన్నారు.

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితిని పెంచాలని కవిత డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. వయోపరిమితి కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!