మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి?: డీకే అరుణ

Must read

తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో మాజీ మంత్రులు, సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరును బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారశైలి అత్యంత హేయంగా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఒక ప్రకటనలో డీకే అరుణ మాట్లాడుతూ.. అసెంబ్లీ పరిసరాల్లో మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దౌర్జన్యాన్ని, ప్రభుత్వ వైఖరిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

“అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ, గౌరవం లేకపోతే రాష్ట్రంలోని సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది?” అని డీకే అరుణ ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థే మహిళా ప్రజాప్రతినిధులతో అనుచితంగా వ్యవహరిస్తే అది ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు ఈ విధంగా వ్యవహరించేలా ఎవరు ఆదేశాలు ఇచ్చారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ ఆదేశాలు ఇచ్చారా? లేక హోంమంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేశారా? అని ఆమె ప్రశ్నించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వంటి సీనియర్ మహిళా నాయకులకు ఈ విధమైన పరిస్థితి ఎదురుకావడంపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి వ్యవహారం జరగడం బాధాకరమని అన్నారు.

“సీనియర్ మహిళా నేతలకు ఇలాంటి అవమానం జరుగుతుంటే కొంచమైనా సిగ్గు అనిపించడం లేదా?” అంటూ ప్రభుత్వంపై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ పరిసరాల్లో సోమవారం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పటికే తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు తమ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపిస్తుండగా.. అధికార పక్షం మాత్రం అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న పోలీసులతో బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారని విమర్శిస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం, భద్రత విషయంలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె కోరారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!