భారత హాకీ జట్లు మరోసారి తమ సాంప్రదాయ నీలి రంగు జెర్సీలో కనిపించనున్నాయి. కాషాయ రంగు జెర్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో హాకీ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు బ్లూ జెర్సీలోనే బరిలోకి దిగనున్నాయి.ఇటీవల నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా జరిగిన ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్లు కాషాయ రంగు జెర్సీలను ధరించాయి. సాంప్రదాయంగా భారత హాకీ జట్లకు గుర్తింపుగా ఉన్న నీలి రంగు జెర్సీ స్థానంలో కాషాయాన్ని ప్రధానంగా ఉపయోగించడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. ఈ మార్పుపై అభిమానులు, క్రీడా వర్గాల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు తమ సంప్రదాయ నీలి రంగు జెర్సీతోనే పోటీపడనున్నాయి. అయితే కాషాయ రంగు జెర్సీని పూర్తిగా పక్కన పెట్టడం లేదని తెలుస్తోంది. బ్లూ జెర్సీకి రెండో ప్రాధాన్యతగా కాషాయ రంగు జెర్సీని ఉంచినట్లు దిలీప్ టిర్కే వెల్లడించారు.ఇదే విధానం భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ టోర్నీల్లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ అర్హత టోర్నీల్లో కూడా భారత హాకీ జట్లు బ్లూ జెర్సీలోనే బరిలోకి దిగుతాయని దిలీప్ టిర్కే స్పష్టం చేసినట్లు సమాచారం.
భారత క్రీడా జట్లలో నీలి రంగు జెర్సీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా హాకీలోనూ దశాబ్దాలుగా భారత జట్లతో బ్లూ జెర్సీకి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే జెర్సీ రంగు మార్పు అభిమానుల్లో చర్చకు దారితీసింది. ఇప్పుడు మళ్లీ బ్లూ జెర్సీకి తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో భారత హాకీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు జాతీయ జట్ల జెర్సీ ఎంపిక, డిజైన్ వంటి అంశాలు అంతర్జాతీయ టోర్నీల నిబంధనలు, ప్రత్యర్థి జట్టు జెర్సీ రంగు వంటి అంశాలపై కూడా ఆధారపడతాయి. అందుకే అవసరాన్ని బట్టి ప్రత్యామ్నాయ రంగు జెర్సీని ఉపయోగించే అవకాశం ఉంటుంది.


