Monday, September 7, 2026

ఎంఎల్సీ తాత మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రి సీతక్క

Must read

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధుపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. ఆయనను వెంటనే బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్ చేయాలని, మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన అనంతరం సీతక్క ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు అవకాశం ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ నేతలు సభలో చర్చకు రాకుండా గేటు వద్ద ఆందోళనలు, నాటకీయ పరిణామాలకు పాల్పడ్డారని సీతక్క విమర్శించారు. పోలీసులపై కూడా దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి తాత మధు చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆమె అన్నారు.దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న సమయంలో ఆయనను ఉద్దేశించి తాత మధు అనుచితంగా మాట్లాడటం సరికాదని సీతక్క పేర్కొన్నారు. స్పీకర్ పదవికి, శాసనసభ గౌరవానికి ప్రతి ఒక్కరూ విలువ ఇవ్వాలని సూచించారు. స్పీకర్‌ను ఉద్దేశించి అవమానకరమైన భాష ఉపయోగించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.తాత మధుపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చర్యలు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు శాసనమండలిలో ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కోరారు. తాత మధు సభ్యత్వం రద్దు చేయడమే తమ ప్రధాన డిమాండ్‌ అని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు వైఖరిపైనా సీతక్క ప్రశ్నలు సంధించారు. స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సమర్థించడం సరికాదని అన్నారు. దళితులు, మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పుకునే బీఆర్‌ఎస్‌.. ఈ వ్యవహారంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపైనా సీతక్క స్పందించారు. విదేశాల్లో చదువుకున్నామని చెప్పుకోవడం మాత్రమే కాకుండా.. ప్రజలతో, ముఖ్యంగా మహిళలు, దళితులు, ఇతర వర్గాలతో గౌరవంగా మాట్లాడే సంస్కారం కూడా ఉండాలని వ్యాఖ్యానించారు. విద్యతో పాటు సంస్కారం కూడా అవసరమని పేర్కొన్నారు.అసెంబ్లీ, శాసనమండలి వంటి ప్రజాస్వామ్య వేదికల్లో సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీతక్క అన్నారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన వేదికల్లో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు తావు ఉండకూడదని పేర్కొన్నారు.బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు యువతను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని కూడా సీతక్క ఆరోపించారు. సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అదే మైండ్‌సెట్‌తో అసెంబ్లీ స్పీకర్‌ను కూడా దూషించారని ఆమె ఆరోపించారు.ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్‌ తాత మధు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ నుంచి, అలాగే శాసనమండలి నుంచి ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!