తెలుగుదేశం పార్టీకి గ్రామస్థాయి నుంచి బలమైన కార్యకర్తలు, నాయకత్వ వ్యవస్థే ప్రధాన బలమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసినప్పుడే ప్రజాప్రతినిధులకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని సూచించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకులకు భవిష్యత్‌లో విజయాలు కష్టమవుతాయని హెచ్చరించారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని సంపాదించి, దాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్, కార్యకర్తలు, నాయకత్వ వ్యవస్థ కలిగిన పార్టీ టీడీపీ అని అచ్చెన్నాయుడు అన్నారు. ఇలాంటి బలమైన కార్యకర్తల వ్యవస్థ కలిగిన పార్టీలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలని సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకత్వం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఐదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో కేవలం 175 మందికి మాత్రమే ఎమ్మెల్యేలుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుందని మంత్రి గుర్తుచేశారు. అలాంటి అరుదైన అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ దాని విలువను గుర్తించాలని సూచించారు. పదవి రావడం ఎంత ముఖ్యమో.. వచ్చిన పదవిని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమని అన్నారు.
రాజకీయ పదవులు శాశ్వతం కాదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుని, దాన్ని నిరంతరం నిలబెట్టుకునేలా ప్రతి నాయకుడు పనిచేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్యకర్తలు, ప్రజలతో నిరంతరం మమేకమై ఉండాలని అన్నారు.ప్రతి సమస్యను పూర్తిగా పరిష్కరించడం సాధ్యం కాకపోయినా.. కనీసం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అండగా నిలవాలని అచ్చెన్నాయుడు సూచించారు. ప్రజలకు ఏమీ చేయలేకపోయినా ఫర్వాలేదని, కానీ వారిని ఇబ్బంది పెట్టడం, వేధించడం మాత్రం చేయకూడదని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే నాయకులకు రాజకీయంగా భవిష్యత్ ఉండదని హెచ్చరించారు.
ప్రజలకు నమ్మకం కల్పించాలి
ప్రతి నియోజకవర్గంలో తమ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని అచ్చెన్నాయుడు అన్నారు. ఫలానా సమయంలో ఎమ్మెల్యేను కలవవచ్చనే విశ్వాసం ప్రజల్లో ఏర్పడితే అనేక సమస్యలు స్థానికంగానే పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు.ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండటం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, చిన్నచిన్న సమస్యల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గుతుందని అన్నారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.టీడీపీకి గ్రామస్థాయి నుంచి ఉన్న కార్యకర్తల బలాన్ని ప్రజా సేవకు ఉపయోగించుకోవాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పార్టీ నాయకత్వం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే ప్రజల్లో పార్టీపై మరింత విశ్వాసం పెరుగుతుందని అన్నారు.పదవులు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అవకాశాలే తప్ప.. అధికారాన్ని చెలాయించడానికి కాదని ప్రతి ప్రజాప్రతినిధి గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, కార్యకర్తలను గౌరవించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడమే నాయకత్వానికి అసలైన కొలమానమని స్పష్టం చేశారు.




